English Version
  3 Oct, 2017
Home / Big Poster / ‘పసుపు’ పచ్చ గులాబీ!

‘పసుపు’ పచ్చ గులాబీ!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: ఏమిటీ ఈ సంకేతాలు!? పొత్తు ముంచుకొస్తోందా? మిగిలిన “పసుపు” కొమ్మును అంతా ములాఖతై మింగేస్తారా!? నిన్నటి అనంతపురం దృశ్యాల వెనుక…నేటి సీనియర్ నేత మోత్కుపల్లి మాటల వెనుక అంతరార్థం ఏమిటి? తెర వెనుక పురుడు పోసుకుంటోన్న ఎజెండా ఏమిటీ? రెండు తెలుగు రాష్ట్రాలలో ఓ పెను రాజకీయ పరిణామానికి అడుగులు పడుతున్నట్టే అనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలుగుదేశం కలిసిపోయే వాతావరణం అగుపిస్తోంది. దీనికి కొంత కాలం నుంచి చాపకింద నీరులా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ – టీడీపీ చెట్టాపట్టాలేసుకునే దిశగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఈ రెండు పార్టీల మధ్య జరిగిన సంఘటనలను పరిశీలించాక…ఇక పొత్తు ఖాయం అన్న భావనకు రాజకీయ విశ్లేషకులు వస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర నుంచి చంద్రబాబు, కేసీఆర్ లు సన్నిహితంగా మెలుగుతున్నారు.

రాజ్ భవన్ లో జరిగే ఎట్ హోం కార్యక్రమంలో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. కేసీఆర్ నిర్వహించిన చండీయాగానికి చంద్రబాబు వచ్చారు. ఆ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు అమరావతికి వెళ్లిన కేసీఆర్, చంద్రబాబు ఇంట్లో విందు చేశారు. అమరావతి నిర్మాణ శంకుస్థాపనకు కేసీఆర్ ఆక్కడకు వెళ్లారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రా టీడీపీ ప్రముఖులు కొందరు కేసీఆర్ ను కలిసి వారి ఇళ్లల్లో జరుగుతోన్న వివాహ శుభకార్యాలకు ఆహ్వానించారు. అయితే… ఈ పరిణామాలన్నీ టీ టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేని పరిస్థితి కల్పించాయి. కేసీఆర్ తో ఫైటే తమ రాజకీయ మనుగడకు మార్గమని మెజారిటీ టీ టీడీపీ నేతలు నమ్మారు. శ్రేణులు సైతం నూటికి నూరుపాళ్లు టీఆర్ఎస్ తో ఫైట్ చేయాలనే భావించారు. పార్టీలో అలా ఫైట్ చేసే నేతలకు హీరోవర్షిప్ రావడానికి కూడా శ్రేణుల మనోగతమే కారణం. కేసీఆర్ పై ఫైట్ చేస్తున్నాడన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డిని తెలంగాణ పసుపుదళం నెత్తిన పెట్టుకుంది. అధినాయకత్వం కేసీఆర్ తో సన్నిహితంగా ఉండటం వారికి నచ్చకపోయినా సర్ధుకున్నారు. ఇదంతా ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణానికి దోహదం చేస్తుందన్న ఉద్దేశంతో ఆవేదనను దిగమింగుకున్నారు. కానీ, ఈ మధ్య పరిణామాలు శృతిమించుతుండటం టీ టీడీపీ కార్యకర్తల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఆంధ్రా టీడీపీ నేతల నుంచి తనకు చాలా పెళ్లి ఆహ్వానాలు అందినా దేనికీ కేసీఆర్ హాజరుకాలేదు. పరిటాల ఇంట్లో పెళ్లికి మాత్రం కమ్మ ప్రముఖులందరినీ తీసుకుని ప్రత్యేక విమానంలో వెళ్లారు. వేదిక పై నుంచి పరిటాల అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

ఇందులో కేసీఆర్ రాజకీయ ఎత్తుగడ లేకపోలేదు. పరిటాలకు హైదరాబాద్ నగరంలో బాగానే అభిమానులు ఉన్నారు. పైగా కమ్మ సామాజికవర్గాన్ని పూర్తి స్థాయిలో ఆకర్షించడమే ఇప్పుడు కేసీఆర్ ఎజెండా. ఏ పార్టీని పుట్టిముంచాలని కేసీఆర్ తెలంగాణ అనే ఆయుధాన్ని భుజాన వేసుకుని బయలుదేరారో ఇప్పుడు అదే పార్టీని కౌగిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ నోటితో చంద్రబాబును గజదొంగ అని తిట్టారో అదే నోటితో “అన్నా…నమస్తే” అంటున్నారు. ఆంధ్రాలో పుట్టిన వారంతా రాక్షసులే అన్న నోటితో అదే ఆంధ్రా నాయకుల ఇళ్లల్లో పెళ్లిళ్లకు వెళ్లి ఆశీర్వదిస్తున్నారు. వైసే వర్సా ఆంధ్రా టీడీపీ నేతలు సైతం కేసీఆర్ చూసి వల్లమాలిన అభిమానం చూపుతూ…పూనకం వచ్చిన వారిలా ఊగిపోతున్నారు. సొంత సీఎం బాబు కంటే కేసీఆర్ ను చూసినప్పుడే పరిటాల కుటుంబం ఉబ్బితబ్బిబ్బయింది. టీవీ దృశ్యాలు చూసిన వారెవరికైనా ఈ విషయం అర్థమవుతోంది. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మనసులో మాట బయటపెట్టారు. కాంగ్రెస్ తో పొత్తు సమస్యే లేదన్నారు. అంత వరకు ఓకే…టీఆర్ఎస్ పొత్తుకు అభ్యంతరం లేదన్నారు.
దీంతో అసలు ఆ రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందన్న పొగ బయటకు వచ్చింది. అదే జరిగితే…కేసీఆర్ కుటుంబానికి జీవిత కాలపు రాజకీయ ప్రత్యర్థిగా వ్రతం తీసుకున్న రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటీ? నరనరానా కేసీఆర్ వ్యతిరేకతను జీర్ణించుకున్న టీడీపీలో కొందరు నాయకులు, లక్షల మంది కార్యకర్తల భవిష్యత్ ఏమిటీ?

Currently has one Comment

  • Nagesh on October 7th, 2017 6:44 pm

    Hello

Lets write yours comments