English Version
  26 Sep, 2017
Home / All in one / మోదీ టీం ఇంత వీకా!?

మోదీ టీం ఇంత వీకా!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : సప్త సముద్రాలు ఈది ఇంటి వెనకాల పడి చావడం అంటారే సరిగ్గా అలా ఉంది తెలంగాణలో బీజేపీ పరిస్థితి. మోదీ, షా ద్వయం దండయాత్రతో ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు విలవిలలాడుతున్నాయి. బతికుంటే బలిశాకు తినవచ్చన్నట్టుగా బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్నాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్ సైతం మిగతా రాష్ట్రాలలో మనుగడ కోసం మోదీ, షా కంటపడకుండా గుహలోకెళ్లి దాక్కోవాల్సిన పరిస్థితి. ఏపీ, తెలంగాణలలో మాత్రం వాళ్ల పప్పులు ఉడకడం లేదు. ఏపీ సంగతి పక్కన పెడదాం. అక్కడ బీజేపీకి మూలాలు లేవు. తెలంగాణ అలా కాదు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ అస్థిత్వం ఉంది. సిద్ధాంత పరంగా బీజం ఉంది. గట్టిగా పనిచేస్తే గ్రేటర్ పై పట్టుబిగించే అవకాశం ఉంది. ఇన్నీ ఉండీ…తెలంగాణలో ఆ పార్టీ పొర్లుదండాలు పెట్టినా జనం పట్టించుకున్న పాపానపోవడం లేదు. మేలో అమిత్ షా వచ్చి రూ. లక్ష కోట్లు ఇచ్చామన్నాడు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి తిరుగు టపా ఇచ్చుకున్నారు. నువ్వు రూ. లక్ష ఇచ్చేదేంటి…నేనే నీకు లక్షన్నర ఇస్తున్నా…రాజకీయం అంటే నల్గొండ చౌరస్తాలో పాములాడించడం అనుకున్నావా? అంటూ ఎడాపెడా వాహించేశారు. దీనిపై బీజేపీ కిమ్మనలేదు. నల్గొండలో షా టూర్ తుస్సుమంది. దీంతో మళ్లీ వస్తానని ఆయన టాటా చెప్పి వెళ్లారు. ఇక లాభం లేదని బాగా మేథోమథనం చేసిన బీజేపీ నేతలు ఎజెండా మార్చారు. సెప్టెంబర్ 17 ను సెంటిమెంట్ తో కొట్టాలని తీర్మానించారు. భారీ చేరికలంటూ హడావుడి చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ వస్తున్నాడని ఊదరగొట్టారు. విలీన దినోత్సవం రానే వచ్చింది. రాజకీయంగా రాష్ట్రంలో ఇటు ఆకు అటు కదలలేదు. రాజ్ నాథ్ వచ్చారు…వెళ్లారు. కేసీఆర్ అంటే ఎవరో ఎరుగనట్టు ఆయన ప్రసంగం సాగింది. తెలంగాణ రాజకీయం జోలికి ఆయన రాలేదు. టీఆర్ఎస్ జోలికి అంతకంటే పోలేదు. ఇంత మాత్రానికి ఈ తారలు ఢిల్లీ నుంచి దిగిరావడం దేనికన్నది ప్రశ్న. మొత్తంగా అటు షా క్రేను, ఇటు రాజ్ నాథ్ క్రేను పెట్టి లేపినా తెలంగాణలో బీజేపీ లేవడం లేదు. ఇక మిగిలింది మోదీ క్రేనే!!

Your Comments / Feedback