English Version
  26 Sep, 2017
Home / All in one / ‘ఘంటా’ కు కత్తెర!!

‘ఘంటా’ కు కత్తెర!!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్: టీఎస్పీఎస్సీ పై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి సెగలు కక్కుతున్నారు. ఉద్యోగాల భర్తీలో అలసత్వం వహిస్తోందన్న నెపంతో కమిషన్ ఛైర్మన్ అధికారాలకు ఉన్న పళంగా కత్తెర వేశారు సీఎం. ఛైర్మన్, కమిషన్ సభ్యులను బై పాస్ చేస్తూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కొత్త బాధ్యతలు అప్పగించారు. బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. కడియంకు ఫోన్ చేసి మరీ టీఎస్పీఎస్సీ వ్యవహారాలు చూడాల్సిందిగా ఆదేశించారు కేసీఆర్. ఈ పరిణామం టీఎస్పీఎస్సీలో చర్చనీయాంశంగా మారింది. నాలుగు రోజుల క్రితమే కమిషన్ ఛైర్మన్, సభ్యుల జీతాలను భారీగా పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. జీతాల పెంపు నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. గడచిన మూడేళ్లలో టీఎస్పీఎస్సీ పూర్తి వివాదాలకు కేంద్రంగా మారింది. కమిషన్ జారీ చేసిన పలు నోటిఫికేషన్లు హాస్యాస్పదమయ్యాయి. కోర్టు వివాదాల్లో చిక్కుకుని నిరుద్యోగుల ఆశల పై నీళ్లు చల్లాయి. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాల పై చూసీచూడనట్టు వ్యవహరించింది. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంగా ఉంది. పుండు పై కారం చల్లినట్టు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధ్యం? అని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ప్రభుత్వం పట్ల నిరుద్యోగులలో మరింత ఆగ్రహాన్ని కలిగించింది. చివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వేచ్చగా ఓయూకు వెళ్లలేనంత తీవ్ర స్థాయికి సమస్య చేరుకుంది. రాజకీయంగా టీఆర్ఎస్ కు ఇది తీవ్ర నష్టంగా పరిణమిస్తోందని గ్రహించిన కేసీఆర్ ఎంపీ బాల్కసుమన్ ఆధ్వర్యంలో ఓ టీంను ఏర్పాటు చేసి, ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఒత్తిడి పేరుతో వారిని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి వద్దకు పంపారు. ఈ టీం ఒక వారం రోజులు హడావుడి చేసింది. తర్వాత ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు పరిస్థితి తయారైంది. తాజాగా విపక్షాలు మళ్లీ నిరుద్యోగ ఎజెండాతో ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన సీఎం, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని రంగంలోకి దింపారని చెబుతున్నారు. నిన్నగాక మొన్న కమిషన్ ఛైర్మన్, సభ్యులకు భారీగా జీతాలు పెంచిన ప్రభుత్వం..సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ చర్య కచ్చితంగా కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి అధికారాలకు కత్తెర వేయడమేనని ప్రచారం జరుగుతోంది.

Your Comments / Feedback