English Version
  26 Sep, 2017
Home / All in one / చీరలో మతలబు అదట!

చీరలో మతలబు అదట!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: చీర చిరిగి చాటయింది. బతుకమ్మ చీర బజార్లో భగ్గున మండింది. ఎంతో ఉత్సాహంతో మొదలైన బతుకమ్మ చీరల పంపిణీ మొదటి గంటలోనే నీరసపడిపోయింది. నాసిరకం చీరలంటూ పలు జిల్లాలలో మహిళలు దుమ్మెత్తి పోయడంతో ప్రభుత్వం పరువు గంగలో కలిసింది. చీరల పంపిణీతో పొలిటికల్ మైలేజ్ ఓ రేంజ్ లో వచ్చేస్తుందని పొద్దున్నే తెల్లబట్టలేసుకుని బయలుదేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జరిగిన పరిణామాలతో తెల్లబోయారు. సాయంత్రానికి అటు కేటీఆర్, ఇటు కవిత రంగంలోకి దిగి నష్ట నివారణ కోసం నానా విధాలా ప్రయత్నించారు. అప్పటికే పోవాల్సిన పరువంతా పోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక పంచాయితీని ప్రతిపక్షం కోర్టులోకి నెట్టేశారు. కొందరు ఎమ్మెల్యేలైతే పరిస్థితి గమనించి షెడ్యూల్ మార్చేసుకున్నారు. రేపటి నుంచి ఉదృతంగా చీరల పంపిణీలో పాల్గొందామనుకున్న మరికొందరు ఎమ్మెల్యేలు…ఆ పని మీరు చూసుకోండి, మేం బిజీ అంటూ ద్వితియ శ్రేణి ప్రజాప్రతినిధులకు పురమాయించారు. జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు కొత్త ప్లాన్ వేశారు. “ఆ చీర అన్న కేసీఆర్ పంపిండు. అదెట్లున్నదని చూడగూడదు. ధరెంత అని ఎంక్వైరీ అసలే చేయగూడదు. ఆడపడుచుకు అన్న ప్రేమతో పంపే గిఫ్టుకు వ్యాల్యూగడతరా? తప్పుగదా! అందులో కేసీఆర్ అనురాగం, ఆప్యాయత చూడాలెగానీ…కాస్ట్లీగుందా లేదా!! అని జూస్తర” అని మహిళల కోపంపై నీళ్లు జల్లే ప్రయత్నాలు చేశారు. మొత్తం మీద ఆ చీర విలువ యాభైనో…రెండొందలో తెలియదు గానీ ఓ రోజంతా తెలంగాణ రాజకీయాలను కుదిపేసిందనే చెప్పాలి.

Your Comments / Feedback