English Version
  6 Oct, 2017
Home / Politics / విపక్షంలో ‘ఒకే ఒక్కడు’!

విపక్షంలో ‘ఒకే ఒక్కడు’!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : సింగరేణిలో విపక్షానికి చావు దెబ్బ! కట్టకట్టుకుని కొట్టించుకున్న దెబ్బ. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఒకే ట్రెండ్. అదే కేసీఆర్ బ్రాండ్. రెండు స్థానాలలో మాత్రం అంచనాలు తిరగబడ్డాయి. ఫలితాలు తలకిందులయ్యాయి. అదీ గులాబీ కంచుకోటలో. అందులో ఒకటి మందమర్రి, ఇంకొకటి భూపాలపల్లి. ఈ రెంటినీ విపక్ష కూటమి బలపరిచిన ఏఐటీయూసీ కైవసం చేసుకుంది. ఫలితాలు ఏకపక్ష మవుతోన్న తరుణంలో ఈ రెండు స్థానాలు విపక్షానికి దక్కాయి. ఇంతకీ ఏం జరిగిందక్కడ!? గెలుపు వెనుక ఏం మంత్రం పని చేసింది? అంటే…రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాల్సిందే. కచ్చితంగా ఆ గెలుపులో కీలక భూమిక టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిదే అనడంలో సందేహం లేదు. రేవంత్ ఎన్నికల ప్రచారంలో ఈ రెండు ప్రాంతాలనే బాగా ఫోకస్ చేశారు. ప్రచారం ప్రారంభమే భూపాలపల్లి నుంచి చేశారు. చివరిగా మందమర్రితో ముగించారు. ఇందులో ఒకదానిని 950 ఓట్ల మెజారిటీతోనూ, మరొకదానిని 844 ఓట్ల మెజారిటీతోనూ విపక్షం సొంతం చేసుకుంది. మధ్యలో రేవంత్ రామగుండంలో ప్రచారం చేశారు. అక్కడ గెలవలేకపోయినా…అధికార పక్షానికి మెజారిటీ బాగా తగ్గింది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, గెలిచే చాన్స్ ఉందని విపక్షం అంచనా వేసుకున్న కొత్తగూడెం, ఇల్లెందులలో కాంగ్రెస్ ముఖ్యులు బాగా ఫోకస్ పెట్టారు. వాస్తవానికి ఆ ఏరియాలో కూడా ఒకసారి ప్రచారం చేయాలని రేవంత్ భావించారట. అయితే, తాము అక్కడకు వెళతామని, మీరు మందమర్రి వెళ్లండి, అందరం ఒక దగ్గరకే ఎందుకని కాంగ్రెస్ నేతలు సూచించారట. దీంతో తనకు కేటాయించిన ప్రాంతాల్లో రేవంత్ శక్తివంచన లేకుండా ప్రచారం చేసి వచ్చారు. ఫలితాలు కూడా ఆయన వెళ్లి వచ్చిన ప్రాంతాల్లోనే సానుకూలంగా వచ్చాయి. అందులోనూ అవి ఉద్యమ గడ్డలు. మొదటి నుంచి టీఆర్ఎస్ కు పెట్టని కోటలు. నిజంగా అలాంటి ప్రాంతంలో టీఆర్ఎస్ అనుబంధ విభాగం ఓటమి అన్నది ఆ పార్టీ పునరాలోచన చేసుకోవాల్సిన అంశం. మొత్తంగా చూస్తే సింగరేణి ఎన్నికల్లో రేవంత్ ఒకే ఒక్కడుగా నిలిచాడన్నది స్పష్టమవుతోంది.

Your Comments / Feedback