English Version
  26 Sep, 2017
Home / All in one / రెడ్లను ‘కోట’లోకి వెళ్లి కొడతారా!!?

రెడ్లను ‘కోట’లోకి వెళ్లి కొడతారా!!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: అశ్వద్థామా అతః కుంజరహ! అన్నట్టు వినీ వినపడకుండా టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ మధ్య కేసీఆర్ పై ఓ వ్యంగ్య విమర్శ చేశారు. 0.5 శాతం జనాభా ఉన్న సామాజికవర్గం తెలంగాణను ఏలుతుంది అన్నదే ఆ వ్యంగ్య విమర్శ. అది వెలమలలో ఎవరికి ఎంత తగిలిందో తెలియదు కానీ…ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం గుండెల్లో గుచ్చుకున్నట్టుంది. ఉత్తమ్ కామెంట్స్ ను గులాబీ బాస్ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. అసలు రెడ్లు లేని రాజకీయం చేయలేమా!? అన్న కసితో ఆయన పావులు కదుపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రెడ్ల కోటలో రెడ్డేతరుల చేత జెండా పాతించి తమ 0.5 శాతం పవరేంటో చూపించాలని సీఎం తెగ ఉవ్విళ్లూరుతోన్నట్టు కనిపిస్తోంది. గుత్త సుఖేందర్ రెడ్డి చేత రాజీనామా చేయించి, నల్గొండ లోక్ సభ బై పోల్ లో గులాబీ జెండాను ఎగురవేయాలన్న ఆలోచన వెనుక ఉత్తమ్ వ్యంగ్యపు మాటల మంట ఉన్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ మొత్తంలో రెడ్ల పెత్తనం పూర్తి స్థాయిలో ఉండేది నల్గొండలోనే. మిగతా జిల్లాలలో ఉన్నా…అవేవీ నల్గొండకు సాటి రాలేవు. అంటే రెడ్లకు ఈ జిల్లా కానీ, ఈ లోక్ సభ నియోజకవర్గం కానీ పెట్టని కోటకిందే లెక్క. వాళ్లను కాదని ఆ స్థానంలో నెట్టుకు రావడం అంత ఈజీ వ్యవహారం కాదు. ప్రస్తుతం కాంగ్రెస్ పగ్గాలు పట్టుకున్న ఉత్తమ్ మొదలు…పీసీసీ రేసు నుంచి సీఎం రేసు వరకు పోటీ పడుతున్న జానారెడ్డి, కోమటిరెడ్డి సైతం ఈ కోటలోని రాజులే. ఈ కోటను బద్ధలు కొట్టడమంటే రెడ్ల కుంభస్థలాన్ని కొట్టడం కింద లెక్క! నల్గొండ బై పోల్ లో రెడ్డేతరుడిని రంగంలో దింపి విజయం సాధిస్తే 2019 ఎన్నికల కంటే ముందే తన ప్రత్యర్థి వర్గమైన రెడ్ల నైతిక స్థైర్యాన్ని కుదేలు చేయవచ్చునన్న అంచనాతో కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. నల్గొండలో కొట్టేస్తే రాష్ట్రం నలుచరగులా కొట్టేసినట్టేనన్నది గులాబీ బాస్ లెక్క. పైగా కాంగ్రెస్ కు సారథ్యం వహిస్తారనుకుంటోన్న ఆ ముగ్గురినీ కొట్టేస్తే గేమ్ ను ముందే ఓవర్ అనిపించవచ్చునన్నది ముఖ్యమంత్రి అంచనా కావచ్చు. రేవంత్ రెడ్డి ఉన్నా…టీడీపీ ఇప్పట్లో లేచి పరిగెత్తే పరిస్థితి లేదు. సో…ఉత్తమ్ వ్యంగ్యానికి ఇలా సమాధానం ఇచ్చే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నారు. అందుకే నల్గొండ బై పోల్ లో కారు గుర్తుపై బరిలో ఎవరిని దింపాలనే దానిపై కేసీఆర్ వద్ద లోతైన కసరత్తు జరుగుతోంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తేరా చిన్నపురెడ్డిలలో ఒకరు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండొచ్చని జరుగుతోన్న ప్రచారం అర్థ సత్యమే. నల్గొండ లోక్ సభ పరిధిలో సామాజిక బలాబలాల పై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఓ విశ్లేషకుడుకి ఫోన్ చేసి ఆరా తీశారు. ముఖ్యంగా యాదవ ఓట్లు ఎన్ని ఉన్నాయని సదరు విశ్లేషకుడుని వినోద్ అడిగినట్టు తెలిసింది. దీని ప్రకారం సీనియర్ నేత నోముల నర్సింహయ్య పేరును సీరియస్ గా పరిశీలిస్తున్నారని అర్థమవుతోంది. మరోవైపు సొంత సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు పేరును కూడా కేసీఆర్ సీరియస్ గా పరిశీలిస్తున్నారు. బీజేపీలో ఉన్న సంకినేనికి కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్ రావుతో కేసీఆర్ ఫోన్ చేయించినట్టు తెలిసింది. నల్గొండ బై పోల్ లో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగాలని కోరినట్టు తెలిసింది. ఈ ప్రయత్నాలను నిశితంగా గమనిస్తే…రెడ్ల కోటలో రెడ్డేతరులను బరిలోకి దింపి గురి చూసి కొట్టాలన్న ఆలోచనతో సీఎం ఉన్నట్టు అర్థమవుతోంది.

Your Comments / Feedback