English Version
  1 Oct, 2017
Home / Latest News / పురోహిత్ మరో కేసీఆర్..!

పురోహిత్ మరో కేసీఆర్..!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: ఎట్టకేలకు తమిళనాడుకు పూర్తి స్థాయి గవర్నర్ వచ్చారు. అస్సాం గవర్నర్ గా ఉన్న భన్వరిలాల్ పురోహిత్ ను తమిళనాడు పూర్తి స్థాయి గవర్నర్ గా కేంద్రం నియమించింది. పురోహిత్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్ లను నియమించింది. అయితే, మిగతా రాష్ట్రాల నియామకాలతో పోల్చితే తమిళనాడు గవర్నర్ నియామకం ప్రత్యేకం. జయలలిత మరణం తర్వాత రాజకీయంగా ఇంకా కుదుటపడని తమిళనాడుకు కొత్త గవర్నర్ గా ఎవరు వస్తారన్న ఆసక్తి సర్వత్రా ఉంది. గత ఏడాది ఆగస్టులో రోశయ్య రిటైర్ అయ్యాక…మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు తమళినాడుకు ఇన్ ఛార్జ్ గవర్నర్ గా కొనసాగుతూ వస్తున్నారు. ఆయన స్థానంలో ఇప్పుడు పురోహిత్ కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఇంతకీ ఈ పురోహిత్ నేపథ్యం ఏమిటి? అన్నది పరిశీలిస్తే చాలా ఆసక్తికర అంశాలే ఉన్నాయి. వాస్తవానికి పురోహిత్ కాంగ్రెస్ నేపథ్యం ఉన్న నాయకుడు. మూడు సార్లు నాగ్ పూర్ లోక్ సభ సభ్యుడుగా పని చేసిన ఆయన రెండు సార్లు కాంగ్రెస్ నుంచే ఎన్నికయ్యారు. ఒక్కసారి మాత్రమే బీజేపీ తరపున గెలిచారు. రెండు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా చేశారు.

రామమందిర ఉద్యమ సమయంలో బీజేపీలో చేరారు. 1991 లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 1996లో బీజేపీ ఎంపీగా గెలిచారు. ప్రమోద్ మహాజన్ తో విబేధాల కారణంగా బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్ మాదిరిగానే విదర్భ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారు. 2003లో ‘విదర్భ రాజ్య పార్టీ’ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తో ఈ పార్టీ ఏర్పాటైంది. 2009లో దుఖాణం కట్టేసి మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2016లో అస్సాం గవర్నర్ గా నియమితులయ్యారు.

తాజాగా పురోహిత్ తమిళనాడు లాంటి కీలక రాష్ట్రానికి గవర్నర్ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జయ మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. అన్నాడీఎంకే లో సంక్షోభం రగులుతూనే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగరరావు పాత్ర కూడా వివాదాస్పదమైంది. ప్రతిపక్ష డీఎంకే గవర్నర్ ను టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో పురోహిత్ నియామకం ఆసక్తికరంగా మారింది. తమిళ రాజకీయాలతో బీజేపీ ఆడుకుంటోందన్న విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ మూలాలున్న వ్యక్తిని గవర్నర్ గా నియమించడం గమనార్హం.

Your Comments / Feedback