English Version
  26 Sep, 2017
Home / All in one / పల్లెల్లో పరుచుకున్న గులాబీ! నగరం దాటని విపక్షం!!

పల్లెల్లో పరుచుకున్న గులాబీ! నగరం దాటని విపక్షం!!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: గులాబీ సైన్యం ఎన్నికల కురుక్షేత్రంలో అడుగు పెట్టింది. ఏడాది ముందే అప్రకటిత సమరశంఖం పూరించింది. ప్రతిపక్షం గడప కూడా దాటక ముందే అధికార పక్షం పల్లెలు చుట్టబెడుతోంది. ప్రత్యర్థి లేని యుద్ధానికి సిద్దమవుతోంది. రాజకీయ చాణక్యుడు కేసీఆర్ రచించిన ఎన్నికల ప్రచార వ్యూహం అప్పుడే అమలుకు రెడీ అయిపోయింది. రైతు సమన్వయ సంఘాల పేరుతో ఓ మహత్తరమైన రాజకీయ వ్యూహానికి కేసీఆర్ తెర లేపారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మూడు నెలల పాటు అనుక్షణం ప్రజల కళ్ల ముందు ఉండేలా ప్రణాళిక రచించారు. ఇది పూర్తిగా రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కార్యక్రమం కావడంతో ప్రతిపక్షాలకు ఎక్కడా చోటు లేకుండా పథక రచన చేశారు కేసీఆర్. రైతు సంఘంలో ఎవరుండాలో ఎమ్మెల్యే సిఫార్సు చేయాలి, ఇన్ ఛార్జ్ మంత్రి ఆమోదించాలన్న నిబంధన పెట్టారు. 90 మంది వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు కనుక ఆ 90 నియోజకవర్గాల్లో వాళ్లు చెప్పిందే ఫైనల్. ఇక మిగత 29 నియోజకవర్గాలలో సైతం ప్రతిపక్ష ఎమ్మెల్యేల కంటే టీఆర్ఎస్ నేతల సిఫార్సులకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. తద్వారా పల్లెల పై పూర్తిగా టీఆర్ఎస్ పట్టు బిగించేలా ఈ పథకం రూపొందించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రభ వెలుగుతోంది. ఇప్పటికీ మెజారిటీ ప్రజలు కేసీఆర్ కే జై కొడుతున్నారు. అయితే…గులాబీ ఎమ్మెల్యేల విషయంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలపై క్షేత్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేసీఆర్ ఫోటో పెట్టుకున్నా వాళ్ల గెలుపు కష్టం అన్న భావన ఉంది. ఈ నేపథ్యంలో రైతు సమన్వయ కమిటీల పేరుతో ఎమ్మెల్యేలందరినీ క్షేత్ర స్థాయికి పంపారు కేసీఆర్. మూడు నెలల వరకు హైదరాబాద్ కు రావద్దని, క్యాంప్ ఆఫీసుకు అసలే రావద్దని ఆర్డర్ వేశారు సీఎం. ఇప్పుడు ఆ ఆర్డర్ ను ఎమ్మెల్యేలు తూచ తప్పక పాటిస్తున్నారు. మొత్తం సరంజామాలతో నియోజకవర్గాల్లో తిష్టవేశారు. సమన్వయ సంఘాల ఏర్పాటు కోసం ప్రతి గ్రామానికీ వెళుతున్నారు. ప్రతి ఊళ్లో జనంతో మమేకమవుతున్నారు. సలహాలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఓ సీనియర్ ఎమ్మెల్యే అయితే ఉదయం ఆరు గంటలకే గ్రామంలో రచ్చబండలు పెడుతున్నారట. ఓ అవ్వా…ఓ అయ్యా…ఓ తమ్ముడు…ఓ అక్కా, చెల్లీ అంటూ ఎన్నికల ప్రచార తరహాలో దూసుకుపోతున్నారట సదరు ఎమ్మెల్యే. మూడేళ్లుగా జనం కంట పడని ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు రైతు సంఘాల పేరుతో మళ్లీ ఊళ్లల్లోకి ప్రవేశిస్తున్నారట! ఈ సంఘాలు పూర్తయితే వచ్చే ఏడాది నుంచి ఎకరాకు నాలుగు వేలు వస్తాయన్న ఆశతో ఉన్న జనం మిగతా కష్టాలు మరచిపోయి ఈ హడావుడిలో నిమగ్నమైపోయారని ఓ సీనియర్ రాజకీయ నాయకుడు చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే…ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో ఎక్కడ చూసినా గులాబీ సందడే నెలకొన్నది. రైతు సంఘాల సంగతి ఏమో కానీ…టీఆర్ఎస్ శ్రేణుల సందడి మాత్రం బాగానే కపిస్తోంది. రైతు సంఘాల కూర్పు జరిగి, అందులో మంచిచెడులు తేలితే తప్ప అసలు కథ తెలియదు. ప్రస్తుతానికైతే…ఊరువాడ గులాబీ గుబాళింపే కనిపిస్తోందట. మరోవైపు విపక్షాల సంగతి చూస్తే ఊసురో మంటున్నాయి. జానానా? ఉత్తమా? అని కొట్టుకు చావడంలో కాంగ్రెస్ తలమునకలైంది. రాహుల్ సందేశ్ పేరుతో ఊరూరా తిరుగుతామని నాలుగు నెలలుగా ఊదరగొట్టడమే తప్ప అడుగు బయటపెట్టింది లేదు. ఇక మహానాడు వరకు స్పీడుగా వెళ్లిన సైకిల్ మూడు నెలలుగా సైలెంటైపోయింది. చంద్రబాబు పట్టించుకోక…రమణ నడపలేక, రేవంత్ రెడ్డిని నడపనివ్వక ఆ పార్టీ రోజు రోజుకు వీకవుతోంది. మొత్తంగా ఇదీ తెలంగాణలో ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం.

Your Comments / Feedback