English Version
  26 Sep, 2017
Home / Big Poster / నల్లగొండ టీఆర్ఎస్ అభ్యర్థిగా చకిలం !

నల్లగొండ టీఆర్ఎస్ అభ్యర్థిగా చకిలం !

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : దసరా తర్వాత బ్రేకింగ్ న్యూస్ రాబోతోంది. నల్లగొండ బై పోల్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. గుత్తాతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలతో విపక్షాలకు సవాల్ విసరబోతున్నారు. తన రాజకీయ పెత్తనాన్ని ప్రశ్నిస్తోన్న రెడ్లకు దిమ్మతిరిగేలా ఈ ఫలితాలు ఉండాలని సీఎం భావిస్తున్నారట. అందుకే రెడ్ల కంచుకోటలో రెడ్డియేతరులతో జెండా పాతించాలని సీఎం గట్టిపట్టుదలతో ఉన్నట్టు సమాచారం. మరి కోటలోకి వెళ్లి కొట్టొచ్చే మొనగాడెవరన్నది ప్రశ్న. ఆ ప్రశ్నకు కూడా కేసీఆర్ సమాధానంఫ వెతికి రెడీగా పెట్టుకున్నారట. నల్లగొండలో ఆదిపత్య రాజకీయాలతో రాటుతేలిన చకిలం శ్రీనివాసరావు కుమారుడు చకిలం అనీల్ ను బరిలోకి దింపేందుకు కేసీఆర్ దాదాపు నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. ఇంతకీ ఎవరీ చకిలం శ్రీనివాస రావు…ఆయన కుమారుడు అనీల్ కి ఉన్న చరిత్ర ఏమిటి? వారి గురించి తెలియాలంటే నల్లగొండ నేపథ్యం తెలియాలి… తరతరాలుగా నల్లగొండ జిల్లా రెడ్ల ఖిల్లాగా వెలుగొందుతోన్న నేపథ్యం. నాటి సాయుధ పోరాటం నుంచి ఏ పోరాటాన్ని తీసుకున్నా నాయకత్వం రెడ్లదే. కాంగ్రెస్ లోనే కాదు కమ్యూనిస్టు పార్టీలలో సైతం నల్లగొండలో పెత్తనమంతా వారిదే. అంతెందుకు…ముప్పై అయిదేళ్ల క్రితం పుట్టుకొచ్చిన టీడీపీలో సైతం నల్లగొండలో ఆది నుంచి రెడ్డి నాయకత్వానిదే పై చేయి. ఎలిమినేటి మాధవరెడ్డి నల్లగొండ జిల్లా కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. తుది శ్వాసవరకు టీడీపీలో నెంబర్ టూ గా వెలుగొందారు. ఎంపీ గుత్తా కూడా టీడీపీ చొక్కా వేసుకొని ఎదిగొచ్చిన వారే. ఇలా ఏ పార్టీని తట్టి చూసినా నల్లగొండలో రెడ్లు లేని రాజకీయం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ సారథులుగా వ్యవహరిస్తోన్న జానారెడ్డి, ఉత్తమ్ లు సైతం ఆ వారసత్వం నుంచి వచ్చిన వారే. ఇంతటి పట్టున్న రెడ్ల కోటను కొట్టాలన్న ఆలోచన చేయడమే దుస్సాహసం కింద లెక్క. వారి కంచుకోట పునాదులను కదిలించాలనుకోవడం మొండితనమే అవుతుంది. కానీ, కేసీఆర్ ఆ మొండితనాన్నే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. తన ప్రభుత్వం రెడ్ల దయాదాక్షిణ్యాల పై నడవడం లేదన్న విషయాన్ని ఆయన రుజువు చేయాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది. నల్లగొండలోనే రెడ్డిలను పక్కన పెట్టి గెలిస్తే ఇక తెలంగాణలో ఏ సెంటర్ లోనైనా వాళ్లతో ఢీ అంటే ఢీ అనవచ్చన్నది కేసీఆర్ లెక్క కావచ్చు. అందుకే ఇంతటి సాహసానికి సీఎం రెడీ అవుతున్నారు. జీవితాంతం రెడ్డిల ఆదిపత్యం పై పోరాడిన చకిలం శ్రీనివాసరావు కుటుంబాన్ని ఎన్నికల బరిలో నిలపబోతున్నారు. ఇంతకీ ఎవరీ చకిలం శ్రీనివాసరావు? ఆయన గురించి ఈ తరానికి పరిచయం లేకపోవచ్చు. కానీ, నల్లగొండ చౌరస్తాలో నిలబడి చకిలం పేరు ఉచ్చరిస్తే చాలు…అప్పటి తరంలో మిగిలి ఉన్నవారు గజగజ వణికిపోతారు. 1960 – 80 దశకాలలో జరిగిన మారణహోమాలు కళ్ల ముందు కదలాడుతాయి. రెడ్డి నాయకులకు – చకిలం శ్రీనివాసరావుకు మధ్య ఆదిపత్యపోరులో నేలకొరిగిన ప్రాణాల ఆనవాళ్లు చాలా గ్రామాల పొలిమేరల్లో స్థూపాల రూపంలో దర్శనమిస్తాయి. ఇటు సొంత పార్టీ కాంగ్రెస్, అటు కమ్యూనిస్టు పార్టీల లోని రెడ్డి నాయకుల ఆదిపత్యాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా చకిలం రాజకీయాలు నడిచేవని చెబుతారు. ఫక్తు సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన చకిలం ఫ్యాక్షన్ రాజకీయాలతో రాటు తేలారు. నల్లగొండ నుంచి ఒక సారి లోక్ సభకు, మూడు సార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. అలాంటి కుటుంబం నుంచి నల్లగొండ లోక్ సభ ఉప ఎన్నికకు కేసీఆర్ అభ్యర్థిని ఎంపిక చేశారని సమాచారం. ప్రస్తుతం నల్లగొండ అసెంబ్లీ టీఆర్ఎస్ ఇన్ ఛార్జ్ గా ఉన్న చకిలం శ్రీనివాసరావు కుమారుడు, చకిలం అనీల్ ను బరిలోకి దింపబోతున్నట్టు తెలిసింది. ఈ మేరకు పార్టీ నాయకులకు కేసీఆర్ స్పష్టమైన ఇండికేషన్ ఇచ్చినట్టు చెబుతున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో అనీల్ పని చేస్తున్నారు. చకిలం ఫ్యామిలీకి టికెట్ ఇవ్వడం అంటేనే రెడ్డి నాయకత్వం విషయంలో కేసీఆర్ మనోగతం ఎలా ఉందో అర్థమవుతోందంటున్నారు. రెడ్డిలు అంటే ఉప్పునిప్పుగా జీవితాన్ని గడిపిన చకిలం కుటుంబాన్ని బరిలోకి దింపడం ద్వారా తాను రెడ్డి వ్యతిరేక రాజకీయానికి సిద్ధమవుతోన్న సంకేతాలను కేసీఆర్ పంపబోతున్నారన్నది అర్థమవుతోంది.

Your Comments / Feedback