English Version
  26 Sep, 2017
Home / All in one / నంద్యాల నువ్వా…నేనా!!?

నంద్యాల నువ్వా…నేనా!!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: అది ఆంధ్రాలో ఎలక్షన్. కానీ, తెలంగాణలో కూడా హీట్ పెంచుతోంది. గెలుపోటములు ఒక ఎత్తు…మెజారిటీ మరో ఎత్తు అన్నట్టుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. పోలింగ్ ముగియడంతో గెలుపెవరిది అన్న ఆసక్తి ఇప్పుడు కాకరేపుతోంది. ఎవరికి తోచిన విధంగా వారు ఊహాగానాలు చేస్తున్నారు. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం ఎవరికి వారు గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆశ్చర్యంగా ఇరు వర్గాలు మెజారిటీ విషయంలో మాత్రం గట్టి ధీమా వ్యక్తం చేయలేక పోతున్నారు. అయిదు నుంచి ఎనిమిది వేల మెజారిటీతో గెలుపు తమదేనని ఇరువర్గాలు చెప్పుకుంటున్నాయి. పోలింగ్ విషయానికి వస్తే అర్బన్ లో టీడీపీకి, గ్రామీణంలో వైసీపీకి అనుకూలంగా ఓట్లు పోలైనట్టు తెలుస్తోంది. నియోజకవర్గ సామాజిక ముఖ చిత్రం వైసీపీకి అనుకూలంగా ఉండటమే తమ మెజారిటీ తగ్గడానికి కారణంగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ముస్లీంలు సుమారు 50 వేల ఓటింగ్ ఉంది. ఇది సహజంగా వైసీపీకి అనుకూల ఓటు. కాంగ్రెస్ ముస్లీం అభ్యర్థిని రంగంలోకి దింపడంతో వైసీపీ ఖాతాకు కోతపడవచ్చన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ నిజంగానే ఆ మేరకు ముస్లీం ఓట్లను చీల్చగలిగిందా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. ఇక మరో బలమైన సామాజికవర్గం వైశ్యులు ఓ మోస్తరుగా టీడీపీకి మొగ్గు చూపినట్టుగా చెబుతున్నారు. 32 వేల వరకు ఉన్న బలిజ సామాజికవర్గ ఓట్లలో మెజారిటీ టీడీపీ వైపే ఉన్నట్టు అంచనా. వైసీపీ తరపున బలమైన అభ్యర్థి రంగంలో ఉండటం, రెండు నెలల క్రితం వరకు టీడీపీలోనే ఉన్న శిల్పా వెళుతూ వెళుతూ స్థానికంగా ప్రభావం చూపగల నాయకత్వాన్ని తమ వెంట తీసుకుపోవడం టీడీపీ మెజారిటీ పై తీవ్ర ప్రభావం చూపిందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో పది వేల మెజారిటీతో గెలవబోతున్నామని…ఇది సామాన్యమైన విషయం కాదని అధికార పార్టీకి చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు. వైసీపీ మాత్రం గ్రామీణ ఓటింగ్ బాగా జరిగినందున గెలుపు తమదేనన్న ధీమాతో ఉంది. ఓ సర్వే సంస్థ, ఓ ప్రైవేటు టీవీ ఛానల్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ప్రకారం అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం కంటే ఎనిమిది శాతం ముందంజలో ఉంది. పోలింగ్ శాతం భారీగా ఉండటంతో టీడీపీ మెజారిటీ 25 వేల వరకు ఖాయం అనేవారు లేకపోలేదు. భూమా కుటుంబం పై సానుభూతి వర్కవుట్ అయిందన్నది వీరి అంచనా. మహిళలు అధికంగా ఓటింగ్ కు రావడం దీనికి నిదర్శనంగా వారు చెబుతున్నారు. సహజంగా మహిళలు ఎక్కువగా ఓటింగ్ కు వచ్చారంటే డబ్బు ప్రభావం అయినా ఉండాలి లేదా సానుభూతి అయినా ఉండాలన్నది విశ్లేషణ. ఈ రెంటిలో ఏ కారణంతో మహిళలు ఓటింగ్ కు వచ్చినా అది టీడీపీకే లాభం అన్న భావన ఉంది. సర్వేల రారాజు లగడపాటి మాత్రం గెలుపు టీడీపీదేనని తేల్చేశారు. మంచి మెజారిటీ కూడా వస్తుందన్నది ఆయన మాట. గెలుపు-మెజారిటీలో అసలు వాస్తవం తేలాలంటే ఈ నెల 28 వరకు ఆగాల్సిందే.

Your Comments / Feedback