English Version
  10 Oct, 2017
Home / Black & White / దేశం ఓడింది…మోడీ గెలిచారు.

దేశం ఓడింది…మోడీ గెలిచారు.

For Advertisements, Contact here : 8074030036

*భిన్న* *స్వరం* :
జాతకాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట! మోడీ పరిస్థితి ఇప్పుడు అచ్చం అలాగే ఉంది. నిజాయితీకి పైజమా కుర్తా వేస్తే నాలాగే ఉంటుందని ఇన్నాళ్లు మోడీ చెప్పుకున్నారు. ఇక్కడే కాదు దేశవిదేశాలు తిరిగొచ్చి అదే చెప్పొచ్చారు. జనం కూడా నమ్మారు. అందుకే అసాధారణ నిర్ణయమైన నోట్ల రద్దును సమర్ధించారు. ఏడాదిగా రూపాయి కోసం అష్టకష్టాలు పడినా భరించారు. జీఎస్టీ- ఓకే దేశం…ఒకే పన్ను అంటే సంబరపడ్డారు. కాలం గడుస్తోన్న కొద్ది జనం కలలు కరగడం మొదలైంది. మోడీ ఒకే సారి ఈ దేశానికి రెండు శస్త్రచికిత్సలు చేశారని…అలా చేయడం ప్రకృతి విరుద్దమని స్పష్టమవుతోంది. “ఒక వ్యక్తి గుండె, మూత్ర పిండాల వ్యాదితో బాధపడుతున్నాడు. వైద్యుడు మొదట గుండెకు శస్త్ర చికిత్స చేస్తాడు. అది విజయవంతమై…గుండె పనితీరు కాస్త మెరుగుపడ్డాక…శరీరం సహకరిస్తుందనుకున్న తరుణంలో మూత్రపిండాల సమస్యకు శస్త్ర చికిత్స చేస్తాడు. అలా కాదని రెండు సమస్యలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే పేషెంట్ చావడం ఖాయం…ఈ దేశానికి నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి రెండు ఆపరేషన్లు మోడీ ఒకే సారి చేశారు. ఫలితం ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు” అని ఓ ప్రముఖ నేత విశ్లేషణ చేశారు. ఓ చాయ్ వాలా దేశ ప్రధాని కావడాన్ని ఈ దేశపు గొప్పతనంగా చెప్పుకున్న జనమే…చాయ్ అమ్ముకునే వాడు ఈ దేశాన్ని పాలించడం అంత తేలిక కాదన్న విషయాన్ని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. తానేం చేసినా దేశం కోసమే అని చెప్పుకోవడంలో మోడీకి ఎవరూ సాటి రారు.

మోడీ ప్రధాని అయ్యాక ఈ మూడున్నరేళ్లలో ఆయన వేసిన అడుగులు జాగ్రత్తగా గమనించండి. ఆయనలో విపరీతమైన వ్యక్తిగత ఇమేజ్ కాంక్ష కనిపిస్తుంది. తాను తప్ప మరెవరూ కనిపించకూడదు, వినిపించకూడదన్న దురాశ తొంగి చూస్తుంటుంది. సొంత పార్టీ నేతలే కాదు…ఈ దేశ చరిత్రలో మహానాయకులనుకున్న వారి చరిత్రలు చెరిపేసి, తన చరిత్ర రాసుకునే తెంపరితనం కనిపిస్తుంది. నెహ్రూ, ఇందిర, వాజ్ పేయ్, అద్వానీ ఇలా ఎవరూ చరిత్ర పుటల్లో ఉండకూడదనుకుంటారు మోడీ. అందుకే ఉన్న వ్యవస్థలు కూల్చేసి తన ఆలోచనకు తగ్గట్టుగా కొత్త వ్యవస్థలు సృష్టించాలనుకుంటారు. ప్రణాళిక సంఘం రద్దు అందులో భాగమే. నోట్ల రద్దు, పన్నుల సంస్కరణలు ఆ కోవలోనివే. అయితే, వాటిని తీసుకురావాలన్న ఆలోచనకు సరైన కార్యచరణ లేదు. ఈ దేశానికి గొప్ప సంస్కరణల ఫలితాలు అందించాలన్న ఆలోచన కంటే…తన వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకోవాలన్న దుగ్థ మోడీ చర్యల్లో కనిపిస్తుంది. గత యూపీఏ ప్రభుత్వం అప్రతిష్ఠపాలు కావడానికి కారణమైన అవినీతినే మోడీ ఎజెండాగా మార్చుకున్నారు. ఈ దేశంలో అవినీతి ఒక ఎమోషనల్ ఇష్యూ. జనం అవినీతి విషయంలో విసిగి వేసారుతుంటారు. అవినీతిరహిత సమాజం అని నాయకులు చెప్పే ఊకదంపుడు మాటలు అసలే నమ్మరు. కానీ, మోడీ అదృష్టం. ఆశ్చర్యకరంగా ఈ విషయంలో దేశ ప్రజలు ఆయన మాట నమ్మారు. నల్లధనం వెనక్కి వస్తుందని విశ్వసించారు. నోట్లరద్దు నల్లకుభేరుల వెన్ను విరిచిందని అనుకున్నారు. కానీ, మేఘాలు తొలగడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అంబానీ, అదానీల పై ఆరోపణలతో మొదలై…ఇప్పుడు విషయం అమిత్ షా కుమారుడు వరకు వచ్చింది. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతోంది. రూ.50 వేల టర్నోవర్ కంపెనీ ఒక్క ఏడాదిలో రూ.80 కోట్ల కంపెనీగా ఎలా మారింది? ఇప్పుడు సమస్య ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటన్నది కాదు. సమీప భవిష్యత్ లో అవినీతి గురించి ఏ నాయకుడు మాట్లాడినా జనం తిరిగి నమ్మలేని పరిస్థితి మోడీ కల్పించారు.

Your Comments / Feedback