English Version
  9 Oct, 2017
Home / Big Poster / తమ్మినేని సారథ్యంలో… పొలమారిన పోరాటం..!

తమ్మినేని సారథ్యంలో… పొలమారిన పోరాటం..!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : తమ్మినేని వీరభద్రం. తెలంగాణ సీపీఎం ఇప్పుడు ఆయన గుప్పెట్లో ఉంది. ఆ పార్టీలో ఇప్పుడు కార్యకర్త నుంచి కార్యదర్శి వరకు ఆయనే. జెండా…ఎజెండాలో ఆయన స్వీయ స్వరం ధ్వనిస్తోంది. ఆ మధ్య ఆయన నాలుగు వేల కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. సామాజిక ఎజెండా అంటూ పల్లె వాడ తిరిగొచ్చారు. చివరాఖరుకు కేరళ సీఎంను పిలిచి ఓ పెద్ద సభ పెట్టారు. లాల్ – నీల్ అంటూ పత్రికలు పతాకశీర్షికతో హెడ్డింగులు పెట్టారు. వీరభద్రం పోరుబాట పట్టారని అనుకున్నారంతా..ఇంతలో సింగరేణిలో సైరన్ మోగించి. బొగ్గుబావుల నుంచి ఓట్లు తోడుకునేందుకు పార్టీలన్నీ పొలోమని క్యూకట్టాయి. అధికార పక్షానికి ధీటుగా విపక్షాలన్నీ ఓ వరుసలో నిలబడ్డాయి. కానీ, సీపీఎంకు కర్త కర్మ క్రియగా ఉన్న వీరభద్రం మాత్రం క్యూలోకి రాలేదు. నా దారి నా ఇష్టం అన్నట్టు వెళ్లారు. ఆయన పార్టీ అనుబంధ విభాగమైన సీఐటీయూ బలం అంతంత మాత్రమే. విపక్షంతో ఆయన కూడా కలిస్తే చన్నీళ్లకు వేడినీళ్ల తోడంటారే అలా ఉండేది. కానీ, బలం లేని బరిలో ఒంటరిగా నిలబడ్డారు తమ్మినేని. తీరా ఎన్నికలు ముగిశాయి. పేరుకు తొమ్మిది డివిజన్లలో అధికార పార్టీ నెగ్గింది. తేడా తిప్పికొడితే నాలుగు వేలే. ఈ నేపథ్యంలో విపక్ష కూటమి ఓటమిని సమీక్షించుకుంది. అందులో కీలక విషయం…తమ్మినేని కాస్త దెబ్బేశారని తేలింది.

ఉమ్మడి ఖమ్మం పరిధిలో డివిజన్ల పై విపక్షం చాలా ఆశలు పెట్టుకుంది. గెలుపోటములు అటుంచితే ఖమ్మం జిల్లానే తమ పరువు దక్కిస్తుందని ఆశించారు విపక్ష నేతలు. కానీ, అక్కడే గట్టిదెబ్బ పడింది. ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెంలలో ఎక్కడా విపక్షం బోణీ చేయలేదు. పోనీ, సీఐటీయూ ఏమైనా పావుకుందా అంటే అదీ లేదు. ఇల్లెందులో 13, మణుగూరులో 64 ఓట్లు ఆ సంఘానికి వచ్చాయి. సీఐటీయూ కంటే హెచ్ఎంఎస్ కు ఎక్కువ ఓట్లొచ్చాయి. ఖమ్మం లాంటి కమ్యూనిస్టు కంచుకోటలో సీఐటీయూకు ఘోర ఓటింగ్ అందరినీ ఆశ్చర్య పరిచింది. ఏం జరిగిందంటే…సీపీఎం ఓట్లు టీబీజీకేఎస్ కు బదిలీ అయ్యాయి. మంత్రి తుమ్మలతో తమ్మినేని రాజీ ఫార్ములా ఫలితమే ఈ ఫలితాలన్నది విపక్ష కూటమి అంచన. మొత్తం మీద తమ్మినేని తెలంగాణలో సీపీఎంను ఏ దరికి చేర్చబోతున్నారో అర్థం కావడం లేదు. సొంత జిల్లా ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేస్తే ఆయన జాడ లేదు…నేరెళ్లలో ఎస్సీ, బీసీ యువత పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే సీపీఎం స్లోగన్ వినిపించలేదు. భూపాలపల్లిలో పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన రైతుల వీపుల పై పోలీసు లాఠీ విరిగితే తమ్మినేని తారసపడలేదు. వామపక్ష పార్టీకి ఇంతకు మించి ఎజెండా ఏముంటుంది? మరి తెలంగాణలో సీపీఎం ఎజెండాతో పాటు జెండా కూడా పీకేస్తారా!?

Your Comments / Feedback