English Version
  26 Sep, 2017
Home / Politics / జానా..డీఎస్ పై కమలం నజర్!

జానా..డీఎస్ పై కమలం నజర్!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: రాష్ట్రంలో బీజేపీ ఫేట్ మార్చేందుకు ఓ ఫేస్ కోసం ఆ పార్టీ కేంద్ర నాయకత్వం అన్వేషిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో వీలైతే అధికారం కాకుంటే కనీసం ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కైవసం చేసుకోవాలని కేంద్ర కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర నాయకత్వంతో ఈ లక్ష్యం సాధించడం అంటే అది పగటి కలే అవుతుందన్న నిశ్చితాభిప్రాయానికి మోదీ-షా ద్వయం వచ్చారు. అందుకే కమలాన్ని వికసింపజేయగల సారథి కోసం వారు గట్టి అన్వేషణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో మొదట వారి దృష్టి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై పడింది. రేవంత్ పై కొండంత ఆశలు పెట్టుకున్న బీజేపీ అధిష్టానం ఆయన ససేమిరా అనడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించింది. బీజేపీ అన్వేషణలో భాగంగా ఇప్పుడు వారి దృష్టి ఇద్దరు అగ్రనాయకుల పై పడినట్టు సమాచారం. అందులో ఒకరు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కాగా మరో నాయకుడు సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డిగా చెబుతున్నారు. వీరిద్దరిలో ఒకరిని పార్టీలోకి తీసుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఆఫర్ చేసే పనిలో బీజేపీ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరిలో డీఎస్ విషయానికి వస్తే…వీలైత ఉమ్మడి ఏపీకే సీఎం కావాలని ఈయన బలంగా కోరుకునేవారు. తెలంగాణ ఏర్పడిన సందర్భంలో సైతం కొత్త రాష్ట్రానికి సీఎం కావాలని డీఎస్ కోరుకున్నారు. ఆయనకు ఆ స్థాయి కూడా ఉంది. అదృష్టం కలిసిరాకపోవడం…దానికి తోడు కొడుకు సంజయ్ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా డీఎస్ తిరిగి సొంత గూటికి రాబోతున్నారన్న ప్రచారం తెర మీదకు వచ్చింది. దీనిని ఆయన ఖండించే లోపే…డీఎస్ చిన్నకుమారుడు అరవింద్ ఆగస్టు 15న మోదీకి మద్దతుగా హిందూ పత్రికలో ఇచ్చిన ప్రకటన కలకలం రేపింది. డీఎస్ బీజేపీలోకి వెళ్లబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
జానా పై నజర్!!
ఇక 2019లో కాంగ్రెస్ పార్టీ ద్వారా సీఎం కావడం పై తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో బిజీగా ఉన్న జానారెడ్డి పై కూడా బీజేపీ అధిష్టానం నజర్ ఉందని సమాచారం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ నుంచి రంగంలోకి దిగమని ఆ పార్టీ అగ్రనేతలు రాయభారాలు నడుపుతున్నారు. అయితే, ప్రస్తుతానికి జానా ఆశలన్నీ కాంగ్రెస్ పైనే ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తనను విస్మరిస్తే అప్పుడు బీజేపీ ప్రతిపాదన పై ఆలోచన చేయవచ్చన్నట్టుగా జానా ఆలోచన ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంతిమంగా స్టేట్ బీజేపీకి బాస్ ఎవరవుతారన్నది వేచి చూడాలి.

Your Comments / Feedback