English Version
  4 Oct, 2017
Home / Black & White / జగన్ ఓ తప్పులకుప్ప!

జగన్ ఓ తప్పులకుప్ప!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదులు రెండు. ఒకటి రాజశేఖర్ రెడ్డి ఛరిష్మా. రెండు జగన్ సోనియాను ధిక్కరించి సొంత కుంపటి పెట్టుకోవడం. ఇందులో వైఎస్ పై జనానికున్న అభిమానమే కీలకమైనది. దాని మూలాల నుంచి వైఎస్ కుమారుడు పోరాటం చేస్తున్నాడన్న అంశం పుట్టుకొచ్చింది. దీంతో రెడ్డి సామాజికవర్గంతో పాటు ఆంధ్రాలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న క్రిస్టియన్ లు, ముస్లీం మైనారిటీలు వైసీపీకి పెట్టని కోటగా నిలిచారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్ర చేసినా, రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చినా, విడిపోయిన రాష్ట్రం గట్టెక్కాలంటే చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడే సీఎం కావాలన్న భావన వ్యాపించినా గెలుపుకు టీడీపీ సర్వశక్తులు ఒడ్డాల్సివచ్చింది. గెలిచేందుకు అవసరమైన ఏ చిన్న అవకాశం కనిపించినా చంద్రబాబు ఆశ్రద్ధ చేయలేదు. మోదీ పవనాలు వీస్తున్నది గమనించి, ధైర్యం చేసి బీజేపీతో పొత్తుకు సిద్దపడ్డారు. రాజకీయంగా ఏ మాత్రం అనుభవం లేని పవన్ కల్యాణ్ ఇంటికి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు స్వయంగా వెళ్లారు.
బాబు ఇలా తన స్థాయిని తగ్గించుకుని మెట్లు మీద మెట్లు దిగడం పలువురు టీడీపీ సీనియర్లకు నచ్చలేదు. అయినా, బాబు బేషజాలకు పోలేదు. అదే సమయంలో జగన్ గెలిచేసినట్టేనన్న ధీమా ప్రదర్శించారు. ఫలితం కేవలం అయిదు లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధికారం కైవసం చేసుకుంది.

ఏపీకి దూరంగా * …
సరే మూడున్నరేళ్లుగా జగన్ ఏం చేస్తున్నారు? ఆయన హైదరాబాద్ ను ఇప్పట్లో వదిలే ఉద్దేశంలో లేరు. ఓటుకు నోటు కేసా…మరొకటా కారణం ఏమైనా చంద్రబాబు ఏపీకి మకాం మార్చేశారు. గడచిన రెండేళ్లుగా అమరావతినే అంటిపెట్టుకుని ఉంటున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష నేతను కలవాలంటే ఏపీ ప్రజలకు హైదరాబాద్ కు వస్తే తప్ప సాధ్యం కాని పరిస్థితి.

ఓటు బ్యాంకుకు చిల్లు
ఇక జగన్ కోటలను ఆయనే బీటలువార్చుకుంటున్నారు. హిందూ పీఠాధిపతులు, మఠాధిపతులను అవసరానికి మించి కలుస్తూ తన సహజ ఓటు బ్యాంకును దెబ్బతీసుకుంటున్నారు. సోనియాతో ఫైట్ చేస్తున్నానని ఇంప్రెషన్ ఇచ్చిన జగన్ మోదీ వద్ద మాత్రం జీ హుజూర్ అంటున్నారు. ఏపీ బీజేపీ నేతలు పలువురితో స్నేహం చేస్తూ సన్నిహితంగా మెలుగుతున్నారు. గోకరాజు గంగరాజు ఇంటికి వెళ్లి ఆర్ఎస్ఎస్ నేతలతో మంతనాలు జరిపారు. దీంతో వైఎస్ వల్ల వరించిన క్రిస్టియన్,.ముస్లీం మైనారిటీ ఓటర్లలో జగన్ పై నమ్మకం సడలే పరిస్థితి ఏర్పడింది. ఇక టీడీపీ విషయంలో సైతం జగన్ అవసరానికి మించి అక్కసు వెళ్లగక్కడం ఆయనకు నష్టం చేస్తోంది. ఆయన ఏ ప్రసంగం చూసినా టీడీపీ పాలన కంటే చంద్రబాబు పేరే ఎక్కువ సార్లు ఉచ్చరిస్తుంటారు. ప్రత్యేక హోదా విషయంలో సైతం ఏంపీలతో రాజీనామా చేయిస్తానని ఆవేశంగా ప్రకటించిన జగన్ ఆ తర్వాత దాని ఊసెత్తడం లేదు. తెర వెనుక తతంగం నడపాల్సిన ప్రశాంత్ కిషోర్ ను తెర మీద చూపించి తన స్థాయిని తానే తగ్గించుకున్నారు జగన్. ఇలా జగన్ గ్రాఫ్ అంతా వ్యూహాత్మక తప్పిదాలతో నిండిపోయింది. ఎక్కడ తగ్గాలో తెలియక ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గని పరిస్థితుల్లో జగన్ ఉన్నారు. జగన్ లో మంచి చెడులతో సంబంధం లేకుండా ఆయనను గుడ్డిగా అభిమానించే వర్గం కూడా ఉంది. అయితే…నంద్యాల ఫలితాల తర్వాత అలాంటి వారి స్వరం కూడా మారుతోంది. ఇది జగన్ జగన్ పతనంలో అత్యంత ప్రమాదకర స్టేజ్!

Your Comments / Feedback