English Version
  8 Oct, 2017
Home / Trending / కొంపదీసి ప్రొఫెసర్ టెమ్ట్ అయ్యారా..?

కొంపదీసి ప్రొఫెసర్ టెమ్ట్ అయ్యారా..?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండ రాం కొత్త రాజకీయ పార్టీ పెడతారా? వాస్తవానికి చాలా కాలం నుంచి ఈ ప్రశ్న తెర మీదకు వస్తూనే ఉంది. అక్కడ ఇక్కడ చక్కర్లు కొట్టి చివరకు సమాధానం దొరక్క తెర చాటుకు వెళుతోంది. మధ్య మధ్యలో కోదండరాం చేసే ప్రకటనలు సైతం పలు ఊహాగానాలకు తావిస్తున్నాయి. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి గురించి ఆలోచిస్తున్నామని కొద్ది నెలల క్రితం ఆయన వెల్లడించారు. అంతలోనే తమ మార్గం జేఏసీనే అని క్లారిటీ ఇచ్చారు. మళ్లీ ఆయన రాజకీయ పార్టీ సమాలోచనల్లో ఉన్నారని వార్తలు వచ్చాయి. దీనిపై మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన ఏటూ తేల్చకుండా స్పందించారు. ‘మీకు ఎవరు చెప్పారో వారినే అడగండి’ అని అర్థం కాని సమాధానంతో సరిపెట్టారు. ఈ మధ్య ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కోదండరాం తరపున వకాల్తా పుచ్చుకుని ఆ పార్టీ, ఈ పార్టీలకు చెందిన నాయకులను కలుస్తున్నారు. ప్రొఫెసర్ గారు పార్టీ పెడదామంటున్నారు…మీ అభిప్రాయం ఏమిటంటూ అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.

తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జేఏసీ నేత ఒకరు ఫేస్ బుక్ లో బాంబు పేల్చారు. “సుదీర్ఘ చర్చల అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి…సైసైసై అంటోన్న కోదండ రాం. నల్గొండ పార్లమెంట్ బరిలో కోదండ రాం” అని పోస్టు పెట్టారు. దీంతో జేఏసీలో అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఈ వార్త నిజం కాకపోవచ్చన్నది రాజకీయ వర్గాల భావన. కోదండ పార్టీ పెట్టడం సంగతి అటుంచితే…నల్గొండ బరిలో దిగేంత సాహసం చేయకపోవచ్చంటున్నారు. ఆ స్థానంలో కాంగ్రెస్ బలహీనంగా ఏమీ లేదు. టీడీపీ కూడా గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. వాళ్ల మద్దతు లేకుండా కోదండ రాం కొత్త కుంపటి పెట్టుకుని రంగంలోకి దిగితే…తాను లాభ పడకపోగా, కాంగ్రెస్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసిన వారవుతారన్నది రాజకీయ విశ్లేషకుల భావన. ఇక కొత్త పార్టీ పై జేఏసీ నేత చేసిన ఫేస్ బుక్ పోస్టు ఫేక్ పోస్టా లేక నిన్న కేసీఆర్ కవ్వింపులకు టెమ్ట్ అయ్యారా అన్నది చూడాలి. కోదండ రాం దొంగాట దేనికి ఏదైనా ఉంటే నేరుగా రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. కొంపదీసి ఆ కవ్వింపులకు ప్రొఫెసర్ టెమ్ట్ అయ్యారా!?

Your Comments / Feedback