English Version
  13 Oct, 2017
Home / Black & White / కేసీఆర్ వేటుకు… విలవిలలాడుతోన్న విశ్వసనీయత!

కేసీఆర్ వేటుకు… విలవిలలాడుతోన్న విశ్వసనీయత!

For Advertisements, Contact here : 8074030036

భిన్నస్వరం : నీ శత్రువు నీకన్నా బలమైనవాడైతే అతని పక్కనే చేరి అంతం చెయ్…ఇది ఓ యుద్ధతంత్రం. ప్రపంచంలో మహా మహా మేథావులనబడే చాలా మంది ఇలాంటి యుద్దతంత్రాలు చాలానే ప్రవచించారు. చరిత్రలో చాలా మంది రాజులు వాటిని అమలు చేసి, విజయం సాధించారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి యుద్దతంత్రాలన్నింటినీ తన అమ్ముల పొది నుంచి బయటకు తీస్తున్నారు. తనకు శత్రువులెవరు, మిత్రులెవరు, శత్రువులుగా ఉన్నవారిలో ఎవరిని మిత్రులుగా మార్చుకోవచ్చు, శాశ్వత శత్రువులనుకున్న వారిని ఎలా దెబ్బతీయవచ్చు అన్నకోణంలో కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే కేసీఆర్ తొలి ప్రాధాన్యత రెడ్డిలకు ఇచ్చారు. ఆ వర్గాన్ని పక్కన పెట్టుకుంటే తనకు రాజకీయ ప్రత్యర్థి అనేవాడే ఉండడని తలంచారు. రాష్ట్ర విభజనతో అప్పటి వరకు రెడ్డిలతో పాటు రాజకీయ అధికారాన్ని అనుభవిస్తోన్న కమ్మవాళ్లకు ఇక తెలంగాణలో రాజ్యాధికారం సాధ్యకాదు కనుక వారిని విస్మరించారు. అదే సమయంలో రెడ్డిలను దరిచేర్చుకుంటే యుద్ధం చేసి, ఓడించకుండానే తెలంగాణలో శత్రుశేషం లేకుండా చేసుకోవచ్చుననుకున్నారు. అందులో భాగంగానే పోచారం, ఇంద్రకరణ్, జగదీశ్వర్, లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డి, నాయిని లాంటి రెడ్డి నేతలకు కేబినెట్ లో పెద్దపీట వేశారు. అధికారగణంలో సైతం మహేందర్ రెడ్డి, శివధర్ రెడ్డి లాంటి వారికి కీలక పోస్టులు కట్టబెట్టారు. రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు చూశాక కేసీఆర్ ప్రత్యామ్నాయం వైపు దృష్టిసారించారు. రెడ్డిల స్థానంలో పాలనాఅనుభవం ఉన్న కమ్మవాళ్లను ప్రోత్సహించే ఆలోచన చేస్తున్నారు. ఈ వర్గంతో రాజకీయంగా తనకు ప్రమాదం లేదన్న ఉద్దేశంతో సరికొత్త ఆలోచన చేస్తున్నారు. రెడ్డిలతో పేచీ తప్పదని నిర్థారించుకున్న తర్వాత ఆ వర్గానికి చెందిన నాయకత్వం పై డైరెక్ట్ ఎటాక్ కు సిద్ధమయ్యారు. అందులో రేవంత్ రెడ్డి లాంటి దూకుడు ప్రదర్శించే నేతలకు కేసులతో ముకుతాడు వేయాలనుకుంటున్నారు. జానారెడ్డిని పెద్దలు అని సంభోదిస్తూనే ఆయన విశ్వసనీయతను దెబ్బతీశారు. ఆయన కేసీఆర్ తో కలిసిపోయారేమోనన్న అనుమానాలు సొంత పార్టీలోనే తలెత్తే పరిస్థితి కల్పించారు. ఉత్తమ్ – కోమటిరెడ్డిల మధ్య పంచాయితీ ఉండటం కేసీఆర్ కు సహజంగా కలిసి వచ్చే అంశం.
ఇక మీడియా విషయానికి వస్తే ఆదిలో కేసీఆర్ పై ఒంటికాలితో లేచే సంస్థల కాళ్లు విరగకొట్టి మూలన కూర్చోబెట్టారు. సుమారు ఏడాదిన్నరకు పైగా తెలంగాణలో టీవీ 9, ఏబీఎన్ ఛానెల్స్ ను తెరమరుగు చేశారు. ఈనాడు యాజమాన్యాన్ని దారికి తెచ్చుకున్నారు. ఎప్పుడైతే రెడ్డిలతో పంచాయితీ తప్పదన్న అభిప్రాయానికి వచ్చారో అప్పుడు మళ్లీ తాను నిషేదించిన మీడియా యాజమాన్యాలతోనే స్నేహానికి సిద్దపడ్డారు. వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారు. ఆంధ్రజ్యోతి ఆర్కేకు రెండు రాష్ట్రాలలో ఓ క్రెడిబిలిటీ ఉంది. ఎవరూ వేయలేని వార్తలను కూడా ఆంధ్రజ్యోతి వేయగలదన్నది జనాభిప్రాయం. ఓ దశలో తెలంగాణలో ప్రతిపక్షం అంటే ఆర్కేనే అన్న స్థాయిలో ప్రచారం జరిగింది. అలాంటి ఆర్కేతో కేసీఆర్ పాత స్నేహాన్ని చిగురింపజేశారు. వీరిద్దరి మధ్య రాజీ కుదరడం పై జనం భిన్నంగా ఏమీ భావించలేదు. ఆర్కే మాత్రం ఒక్కడే ఎన్నాళని పోరాడతాడు అన్న వాదన వినిపించింది. అయితే…ఆంధ్రజ్యోతికి ఈ విశ్వసనీయత ఎప్పటికైనా తనకు ఇబ్బందే అని కేసీఆర్ అంచనా వేసుకున్నట్టున్నారు. అనంతపురం పరిటాల శ్రీరాం పెళ్లికి వెళుతూ తనతో పాటు పలువురు కమ్మ ప్రముఖులను, ఆర్కేను కూడా వెంట తీసుకెళ్లారు. దీంతో భవిష్యత్ లో ఆంధ్రజ్యోతి ఎలాంటి భిన్నమైన పాత్ర పోషించలేని పరిస్థితి కల్పించారు. ఒకవేళ పోషిద్దామనుకున్నా దాని విశ్వసనీయత పై ఇప్పుడే దెబ్బకొట్టారు కేసీఆర్. ఇక ఈనాడు ఏనాడో రాజీబాట పట్టింది కనుక దాని మానాన అది పని చేస్తుంది. ఆ పత్రికతో కేసీఆర్ కు ఇబ్బందేం లేదు. టీవీ9కు పత్రిక లేదు. ఛానెల్ రావాలో లేదో తేల్చేది తానే. కనుక ఆ యాజమాన్యం తోకజాడించేది లేదు. ఇప్పటికే వాళ్లు కేసీఆర్ కనుసైగల మేరకు పనిచేస్తున్నారన్న ప్రచారంతో దాని విశ్వసనీయత కూడా డ్యామేజ్ అయింది. ఇక కేసీఆర్ కు మిగిలిన ఏకైక శత్రువు రెడ్డిలే!

Your Comments / Feedback