English Version
  13 Oct, 2017
Home / Big Poster / కేసీఆర్ వరాలలో వినిపిస్తోన్న స్వరాలేమి!?

కేసీఆర్ వరాలలో వినిపిస్తోన్న స్వరాలేమి!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : ఊరికే రారు మహానుభావులు అని నానుడి. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఊరికే ఏదీ చెప్పరు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి పదం రాజకీయాన్ని వంటపట్టించుకుని వస్తుంది. తాజాగా కేసీఆర్ సూర్యపేట జిల్లాలో పర్యటించారు. కొత్త కలెక్టరేట్ కు శంకుస్థాపన చేశారు. ఇందులో చెప్పుకోవడానికి ఏముంది…నిన్న సిద్ధిపేట, సిరిసిల్లల్లో కూడా చేశారు కదా! అనవచ్చు. కరక్టే…కానీ, సూర్యపేటలో ఆయన ప్రసంగం అంత తేలిగ్గా తీసిపారేసేలా లేదు. నల్గొండ పార్లమెంట్ కు గుత్తా చేత రాజీనామా చేయించి, ఉప ఎన్నికకు వెళ్లే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సుమారు నెల రోజుల నుంచి ఈ ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. మధ్యలో సింగరేణి ఎన్నికల విషయం గురించి మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ వద్ద విలేకరులు నల్గొండ విషయం కూడా ప్రస్తావించారు. ఆయన దానిని కొట్టి పారేయకుండా…కర్ర విరగదు – పాముచావదు అన్న రీతిలో చెప్పేసి చేతులు దులుపుకున్నారు.

తాజాగా సూర్యాపేటలో ఆయన ప్రసంగాన్ని డీకోడ్ చేస్తే ఉప ఎన్నిక సంకేతాలు కనిపిస్తున్నాయి. అడిగిన వారికి అడగని వారికి ఆయన వరాల జల్లు కురిపించారు. కాంగ్రెస్ ను ఉతకడంలో డోసు పెంచారు. ఓట్ల లెక్క ప్రకారం సీఎం ప్రసంగం సాగినట్టు అనిపించింది. ముఖ్యంగా గిరిజన ఓటర్లను గుండుగుత్తిగా ఆకర్షించే ప్రయత్నం చేశారు కేసీఆర్. సూర్యాపేటలో గిరిజన భవనం, తండాలకు రూ. పది లక్షలు, పంచాయతీలకు రూ.15 లక్షల హామీలు ఆ కోవలోకే వస్తాయి. నల్గొండ బై పోల్ వస్తే టీఆర్ఎస్ అభ్యర్థిగా గిరిజన సామాజికవర్గానికి చెందిన బాలు నాయక్ ను బరిలోకి దింపే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక మిగతా హామీల విషయానికి వస్తే సూర్యపేట, నల్గొండలలో మెడికల్ కళాశాలలు, మూసీ నది అభివృద్దికి రూ.65 కోట్లు, సూర్యాపేట అభివృద్దికి రూ. 75 కోట్లు సీఎం ప్రకటించారు. దామరచర్ల పవర్ ప్లాంటుతో ఉమ్మడి జిల్లా రూపురేఖలే మారిపోతాయన్నారు. ఇక మిషన్ భగీరథ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటు ప్రారంభం, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపనలు చేశారు.

ఇక కాంగ్రెస్ ను టార్గెట్ చేయడంలో సైతం సీఎం వాడి పెంచారు. నాగార్జున సాగర్ తమ హయాంలోనే నిర్మించామని ఇటీవల కాంగ్రెస్ నేతలు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆ ప్రాజెక్టు నిర్మాణమంతా ఆంధ్రా ప్రాంతానికి నీరు పోయేలా జరిగిందని, ఏలేశ్వరం వద్ద ఆ ప్రాజెక్టు కట్టి ఉంటే తెలంగాణకు మేలు జరిగి ఉండేదని సీఎం చెప్పుకొచ్చారు. తద్వారా ఆ ప్రాజెక్టు కాంగ్రెస్ పుణ్యమే అని చెబుతోన్న టీ కాంగ్రెస్ నేతల ఉబలాటం పై నీళ్లు చల్లే ప్రయత్నం చేశారు కేసీఆర్. మొత్తంగా చూస్తే…సీఎం కేసీఆర్ ప్రసంగం ఆసాంతం ఎన్నికలకు అవసరమైన విధంగానే సాగింది. మరి ఉప ఎన్నిక వస్తుందా అంటే…చూడాలి!

Your Comments / Feedback