English Version
  28 Sep, 2017
Home / Politics / కాంగ్రెస్ టికెట్ అడుగుతోన్న ఎర్రబెల్లి !

కాంగ్రెస్ టికెట్ అడుగుతోన్న ఎర్రబెల్లి !

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: కొద్దిమంది నేతలకు రాజకీయాలకు, పేకాటకు పెద్ద తేడా ఉండదు. దేన్నైనా ఒకేరకంగా ఆడుతుంటారు. పేకాటలో మన చేతిలో ఉన్న ముక్కల కంటే ఎదుటి వాడి చేతిలో ఉన్న ముక్కలకే విలువెక్కువ! ప్రత్యర్థి దగ్గర ఏయే ముక్కలు ఉన్నాయో తెలిస్తే మన ఆట తేలికైపోతుంది. ఈ విద్యలో టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరితేరారు. ఇప్పుడే కాదు టీడీపీలో ఉన్న రోజుల్లోనూ ఆయన అంతే! చెప్పుకోడానికి టీడీపీ లీడరే అయినా అన్నీ పార్టీల్లోనూ ఆయన అనవాళ్లు కనిపించేవి. ముఖ్యమంత్రులు ఎవరైనా దయన్నకు రెడ్ కార్పెట్ ఉండేది.

ఎర్రబెల్లి ఏం మంత్రం వేస్తాడో…అన్నీ పార్టీల్లోనూ చెల్లుబాటవుతాడని అప్పట్లో టీడీపీ నేతలు జోకులు వేసుకునే వారు. టీడీపీలో ఉన్నన్నాళ్లు ఆయన వార్తల్లో లేనిరోజు ఉండేది కాదు. ఓ రోజు చంద్రబాబును చికాకు పెట్టి వార్తల్లోకెక్కేవారు. మరో రోజు ఆయన కాళ్లు మొక్కి ప్రసన్నం చేసుకునేవారు. అదేంటంటే…తెలంగాణ కోసం మొక్కానని చెప్పి మీడియాను ఉరుకులు పరుగులు పెట్టించే వారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి ‘కారు’ ఎక్కారు. ఏడాదిన్నరగా చడీచప్పుడు లేదు. అప్పుడు రోజూ న్యూస్ మేకర్ గా ఉన్న దయన్న ఇప్పుడు చప్పుడు చేయడం లేదు. ‘సొంత’ మనిషి కేసీఆర్ లీడర్ షిప్ లో నడుస్తోన్న పార్టీ…ఇక ఎర్రబెల్లి రాజ్యం అనుకున్నారంతా! కానీ, గులాబీ కడువా వెనుక ఆయన తచ్చట్లాడుతున్నారు తప్ప…ఫోకస్ లోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా దయన్న కాంగ్రెస్ సీనియర్ నేత – ఎల్పీ నేత జానారెడ్డి దగ్గర ప్రత్యక్షమైనట్టు సమాచారం. ఆయన జానా వద్దకు ఎందుకు వచ్చారా! అని ఆరా తీస్తే ఇంట్రెస్టింగ్ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. 2019 లేదా అంతకంటే ముందైనా సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వరంగల్ తూర్పు టికెట్ కావాలని జానాను కోరారట ఎర్రబెల్లి. అదేంటి! టీఆర్ఎస్ లో ఆయనకేమైంది…పాలకుర్తి ఉంది కదా అనుకుంటున్నారా! నిజమే…అయితే, వరంగల్ తూర్పు టికెట్ ఆయన కోసం కాదట. ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు కోసమట. వాస్తవానికి టీడీపీలో ఉన్న కాలం నుంచే ఎమ్మెల్యే కావాలని ప్రదీప్ ఆశిస్తున్నారు. తన కోరికను దయన్న తీర్చకపోవడంతో మధ్యలో ప్రదీప్ ప్రజారాజ్యంలో చేరారు. అక్కడ వర్కవుట్ కాక తర్వాత బయటకు వచ్చేశారు. 2014 లో సైతం ప్రదీప్ కు దయన్న దీవెనలు లభించలేదు. దీంతో ఆయన బాగా అప్ సెట్ అయినట్టు చెబుతున్నారు.

2019 లో టీఆర్ఎస్ నుంచి అన్నదమ్ములిద్దరికీ టికెట్ ఇస్తారా అంటే డౌటే. పైగా 2019లో టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందా అంటే…ఏమో! టీఆర్ఎస్ మిస్ కొడితే వచ్చేది కాంగ్రెస్సే. దీంతో తమ్ముడుకి కాంగ్రెస్ టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో ఎర్రబెల్లి ఉన్నారట. 2019 లో ఒకవేళ కారు పంక్చరైనా అభయ ‘హస్తం’ ఉండాలన్న ఆలోచనతోనే దయన్న ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారట. ఉదర్ కా మాల్ ఇదర్…ఇదర్ కా మాల్ ఉదర్ లో దయాకర్ రావు స్టైలే వేరు. మరి అధిష్టానం వద్ద పరపతి పాతాళానికి పడిపోయిన జానారెడ్డి, ఎర్రబెల్లి కోరికను తీర్చగలరా! చూడాలి.

Your Comments / Feedback