English Version
  26 Sep, 2017
Home / Politics / కవితను టార్గెట్ చేసిన కమలం !

కవితను టార్గెట్ చేసిన కమలం !

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను బీజేపీ టార్గెట్ చేసింది. తెలంగాణలో పార్టీ బలోపేతాన్ని కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడంతోనే మొదలు పెట్టాలని భావిస్తున్నట్టుంది. అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కవిత ఇలాకాలో ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్దం చేసినట్టు కనిపిస్తోంది. సెప్టెంబర్ 17 పై ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా తిరిగి గ్రౌండ్ సిద్ధం చేసిన బీజేపీ నేతలు అసలు కార్యానికి నిజామాబాద్ ను కేంద్ర స్థానంగా చేసుకున్నారు. ఆ రోజున ఏకంగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిజామాబాద్ రాబోతున్నారు. దీనిని బట్టే సెప్టెంబర్ 17 కు బీజేపీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతోంది. విమోచన సెంటిమెంట్ ను రగల్చడం ద్వారా ముస్లీమేతర వర్గాలను ఆకర్షించే ప్రయత్నంలో కాషాయదళం ఉంది. ఒకటి సెప్టెంబర్ 17, రెండు నిజామాబాద్ కేంద్రం…ఈ రెండిటి ఎంపికలో కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది.

ఈ ఏడాది మేలో అమిత్ షా తెలంగాణకు వచ్చారు. అప్పుడు మోసుకొచ్చిన ఎజెండా వేరు. రాష్ట్రాభివృద్ధి- కేంద్ర సహకారం కోణంలో షా తెలంగాణ సమాజాన్ని టచ్ చేశారు. ఫలితం పెద్దగా కనిపించలేదు. పైగా నిధుల లెక్కల విషయంలో షాకు కేసీఆర్ చివాట్లుపెట్టారు. ” నిధులు మీరు మాకిచ్చేదేంటి…మేమే మీకు(కేంద్రానికి) ఇస్తున్నాం” అని గుడ్లు ఉరిమారు. దీనిపై బీజేపీ నుంచి ఓ మోస్తరు కౌంటర్ కూడా రాలేదు. సీన్ కట్ చేస్తే సెప్టెంబర్ 17తో బీజేపీ మరోసారి హడావుడి మొదలు పెట్టింది. విమోచన దినోత్సవానికి గడచిన మూడేళ్లలో ఇవ్వని ప్రాధాన్యతను బీజేపీ ఈ సారి ఇస్తోంది. ఇదంతా చూస్తుంటే….షా టూర్ తో చేసిన ‘అభివృద్ధి – కేంద్ర సహకారం’ ప్రయోగం ఫలితాలు ఇవ్వలేదని తేలిపోయింది. అందుకే బీజేపీ తిరిగి సెంటిమెంట్ ప్రయోగానికే జై కొడుతున్నట్టు అర్థమవుతోంది. ఆ ట్రిగ్గర్ కూడా సరైన చోటే నొక్కాలన్న లెక్కకు వచ్చింది. దీనికి నిజామాబాద్ ను వ్యూహాత్మక కేంద్రంగా ఎంచుకుంది. సహజంగా ఈ పార్లమెంట్ పరిధిలో మతపరంగా సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయి. పైగా ముఖ్యమంత్రి కుమార్తె సొంత నియోజకవర్గం. తమ అస్త్రం ఇక్కడ గురి తప్పదని కమలనాథులు అంచనా వేస్తున్నారు.

Your Comments / Feedback