English Version
  11 Oct, 2017
Home / Big Poster / ఎన్టీఆర్ బయోపిక్ లో… ‘లక్ష్మీ’నే వర్మ ఎందుకు టచ్ చేస్తున్నారు!

ఎన్టీఆర్ బయోపిక్ లో… ‘లక్ష్మీ’నే వర్మ ఎందుకు టచ్ చేస్తున్నారు!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : నందమూరి తారక రాముడి జీవిత చరిత్ర అంటే అదొక మహా సముద్రం. నిమ్మకూరులో తొలి అడుగుల నుంచి ప్రభుత్వంలో సబ్ రిజిస్ట్రార్ గా, విశ్వవిఖ్యాత నటుడుగా, రాజకీయదురంధరుడుగా ఒకే జన్మలో ఆయన అనేక అవతారాలెత్తారు. అందుకే అవతార పురుషుడయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన జీవిత చరిత్ర వెండి తెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఒరిజినల్ కథలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణే ఎన్టీఆర్ గా నటించబోతున్నారు. దాని కోసం సుదీర్ఘ కసరత్తు జరుగుతోంది. మధ్యలో ‘జై ఎన్టీఆర్…జై ఎన్టీఆర్’ అనే పాటతో ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెర మీదకు వచ్చారు. తాను ఎన్టీఆర్ బయోగ్రఫీ తీయబోతున్నట్టు ప్రకటించారు వర్మ. బాలకృష్ణ చెబుతోన్న బయోగ్రఫీ, వర్మ తీస్తానంటోన్న బయోగ్రఫీ ఒక్కటేనా అన్న గందరగోళం కొద్ది రోజులు నెలకొంది. ఇంతలో తన సినిమా పేరు “లక్ష్మీస్ ఎన్టీఆర్” అని ప్రకటించి, దానికి సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేసి రెండు బయోగ్రఫీలు వేర్వేరని క్లారిటీ ఇచ్చారు. అయినా…ఎన్టీఆర్ బయోగ్రఫీ మొత్తాన్ని వర్మ తెరకెక్కించడం లేదు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశం నుంచి ఆయన మరణం వరకు ఈ సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. ఇంతకూ వర్మ ఎన్టీఆర్ జీవితంలోని ఆ కొద్ది కాలాన్నే ఎందుకు ఎంచుకున్నారు అన్నది ప్రశ్న. వర్మ బేసిక్ గా డైరెక్టర్. నిజ జీవితంలో ఏం జరిగిందన్న దాని కంటే ఏం తీస్తే…ఎలా తీస్తే జనం చూస్తారన్న కోణంలో మాత్రమే ఆయన ఆలోచిస్తారు. ఆ కోణంలో చూస్తే లక్ష్మీ పార్వతి ప్రవేశం నుంచి ఎన్టీఆర్ జీవిత కథలో ఆసక్తికర ఎలిమెంట్. అక్కడ నుంచే ఆయన కథలో వివాదం ఉంది. మానవ సైకాలజీ ప్రకారం ఆ ఎపిసోడ్ పైనే ఆసక్తి ఎక్కువ.

అతి సామాన్యమైన ఒక ఆడది ఎన్టీఆర్ లాంటి మహోన్నత శక్తి జీవితంలోకి ఎలా ప్రవేశించింది? ఎన్టీఆర్ జీవితంలోకి అడుగు పెట్టే సమయంలో ఆమె స్థాయి ఏమిటి? మొదట్లో ఆయన వద్దకు వచ్చేటప్పుడు ఆవిడ ఎలా ఉండేది? గుంపుతో కలిసి వచ్చి ఒక్కటిగా ఎన్టీఆర్ అభిమానాన్ని ఎలా చూరగొంది? ఏం చూసి ఎన్టీఆర్ ఆవిడకు దగ్గరయ్యారు? పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడు…ఎలా పుట్టింది? ఏకులా వచ్చిన పార్వతి మొదట ఎన్టీఆర్ వద్ద ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో మేకులా ఎలా మారింది? ఆవిడ రాకతో తెలుగుదేశం అంతర్గత రాజకీయాలు ఎలా మారాయి? పార్టీ పై ఆవిడ పెత్తనంతో చంద్రబాబు వర్గం ఎలా ఉక్కపోతను అనుభవించింది? ఆ తర్వాత అధికార మార్పిడిలో అంతర్గతంగా జరిగిన తతంగం ఏమిటి? ఎన్టీఆర్ మరణానికి ముందు ఏం జరిగింది? ఆయన మరణం ఎలా సంభవించింది? ఇలా ప్రతి ప్రశ్న విపరీతమైన ఆసక్తిని రేకెత్తించేవే…ఇప్పటి వరకు ఇవి జనం నోళ్లలో నానుతున్న ప్రశ్నలు. ఇలా జరిగి ఉండవచ్చు…అలా జరిగి ఉండవచ్చు అని ఊహించుకోవడమే…ఆ ఊహలనే తెరకెక్కిస్తే…ఆ ఆసక్తి పీక్ లెవల్లో ఉంటుంది. అందుకే ఆ వివాదాల ఎపిసోడ్ ను మాత్రమే వర్మ తన కంటెంట్ గా ఎంచుకున్నట్టు అనిపిస్తోంది.

Your Comments / Feedback