English Version
  26 Sep, 2017
Home / Politics / ఇలా చేశావేంటి మోదీ!?

ఇలా చేశావేంటి మోదీ!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం : ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించారు మోదీ. ఏ పేరు, ఏ క్షణాన తెర మీదకు వస్తుందో తెలియదు! ఎవరి పేరు ఏ ఈక్వేషన్ లో ప్రచారంలో పెట్టారో తెలియదు!! చివరికి తెలుగు రాష్ట్రాలకు మిగిలింది శూన్యం అన్నట్టుగా కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. తెలంగాణకు ఉన్న ఒక్క పదవీ ఊడబెరికిన ప్రధాని చివరకు కేబినెట్ లో ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. ఇంతకీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో జరిగిన తంతేంటి? కొత్త మిత్రులకు చేయ్యివడానికి కారణం ఏమిటి? కేబినెట్ బెర్త్ కోసం టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలేమిటి? కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ వార్తలు తెర మీదకు వచ్చినప్పటి నుంచి బీజేపీ నుంచి ఎవరు అవుట్…ఎవరు ఇన్ అన్న దాని కంటే ఉన్న మిత్రులు, కొత్త మిత్రుల విషయంలో మోదీ ఏం చేయబోతున్నారన్న ఆసక్తే ఎక్కువగా నెలకొంది. జేడీయూ, ఏఐడీఎంకేలు ప్రభుత్వంలో చేరడం పై దాదాపు నిర్ణయానికి వచ్చిన పరిస్థితి కనిపించింది. ఏపీ విషయానికి వస్తే మిత్రపక్షం టీడీపీకి చెందిన అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి విషయంలో మార్పులు ఉండవన్న సంకేతాలు ముందే ఇచ్చారు. ఎటు తిరిగి ఏపీ బీజేపీ నుంచి ఎవరికి ఛాన్స్ అన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలో మొదట రాం మాధవ్ పేరు ప్రముఖంగా వినిపించింది. సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆయన స్థానంలో విశాఖ ఎంపీ హరిబాబు పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆయనను వెంటనే బయలుదేరి ఢిల్లీకి రమ్మనడంతో హరిబాబుకు బెర్తు ఖరారైందనే అందరూ అనుకున్నారు. అర్ధరాత్రి సమయానికి ఆయన పేరు కూడా గల్లంతై ఏపీకి ఏమీ లేదని తేల్చేశారు.
*తెలంగాణకు మరీ అన్యాయం*
:తెలంగాణ విషయంలో మోదీ మరీ అన్యాయంగా వ్యవహరించారు. ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏకైక మంత్రి బండారు దత్తాత్రేయకు ఉద్వాసన పలికారు. ఆయన స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావుకు అవకాశం ఇస్తున్నట్టు ఓ దశలో విస్తృత ప్రచారం జరిగింది. చివరి నిముషంలో ఆ పేరు పక్కకుపోయి కేంద్ర జలవనరుల సలహాదారు, నల్గొండ జిల్లాకు చెందిన వెదిరె శ్రీరామ్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆయన పేరు తొంభై శాతం ఖరారైనట్టేనని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అంతలోనే ఆయనను పక్కన పెట్టేశారు.
*టీఆర్ఎస్ చేరిక పై…*
ఇక టీఆర్ఎస్ కేంద్ర కేబినెట్ లో చేరే అవకాశాలు చివరి నిముషం వరకు కనిపించాయి. కనీసం ఆ రూపంలోనైనా కేంద్ర కేబినెట్ లో తెలంగాణకు ప్రాతినిధ్యం లభిస్తుందని చాలా మంది భావించారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగబోతున్న సమయంలో కంటి ఆపరేషన్ పేరుతో కేసీఆర్ ఢిల్లీలో మకాం వేయడం రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. కేబినెట్ లో టీఆర్ఎస్ చేరే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అంచనా వేశాయి. దీనికోసం మోదీ వద్దకు కేసీఆర్ రాయబారం పంపినట్టు వార్తలు వచ్చాయి. కేబినెట్ లో తెలంగాణ నుంచి టీఆర్ఎస్ కు ఒకటి, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని, దత్తాత్రేయను వెంటనే గవర్నర్ గా పంపడం ద్వారా ఖాళీ అయ్యే సికింద్రాబాద్ స్థానం నుంచి బీజేపీ మంత్రి అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తానే తీసుకుంటానని కేసీఆర్ ప్రతిపాదించినట్టు టీఆర్ఎస్ కు చెందిన ఓ వర్గంలో ప్రచారం జరుగుతోంది. దీని కోసం అరుణ్ జైట్లీ ద్వారా కేసీఆర్ రాయబారం నడిపారన్నది ఆ వర్గం భావన. అయితే…కేంద్ర బీజేపీ ఏం ఆలోచన చేసిందో తెలియదు కానీ, ఈ ప్రతిపాదనలేవీ కార్యరూపం దాల్చలేదు. వాస్తవానికి కసరత్తులో చివరి నిముషం వరకు ఉత్కంఠ కొనసాగడానికి ఏపీ, తెలంగాణల విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోవడమేనంటున్నారు. మొత్తంగా చూస్తే మొదటి నుంచి ప్రచారం జరిగిన ఏఐడీఎంకే, జేడీయూలతో పాటు చివరి నిముషంలో ఉత్కంఠ రేపిన టీఆర్ఎస్ కు కూడా బెర్తులు లేకుండానే పునర్ వ్యవస్థీకరణ పూర్తయింది. వీరి కోసం త్వరలోనే మరోసారి మోదీ విస్తరణ చేపడతారా? లేక ఇంతే సంగతులా అన్నది చూడాలి.

Your Comments / Feedback