English Version
  26 Sep, 2017
Home / Politics / ఇక ప్రతిపక్షం పవనేనా!?

ఇక ప్రతిపక్షం పవనేనా!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష శూన్యత కనిపిస్తోంది. వైసీపీ స్థానంలో టీడీపీకి ప్రత్యామ్నాయంగా జనం మరో పార్టీని ఎంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నంద్యాల తీర్పు ఏపీ రాజకీయాలను సమూలంగా మార్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలు ప్రత్యామ్నాయ ప్రతిపక్షానికి సిద్దమవుతోన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నంద్యాల ఎన్నికల ఫలితాలను లోతుగా విశ్లేషిస్తే ఇదే నిజమనిపిస్తోంది. ఉప ఎన్నికలు అధికార పక్షానికి అనుకూలంగా ఉండటం సహజం. పవర్ లో ఉన్న పార్టీ సహజంగానే అధికార హంగులు, డబ్బు ఖర్చు విషయంలో వెనకాడదు. నంద్యాలలో వైసీపీ కూడా డబ్బు విషయంలో అధికార పక్షంతో పోటీ పడింది. జగన్ ఏకంగా డజను రోజులు నంద్యాలలోనే మకాం వేశారు. నియోజకవర్గ సామాజిక ముఖచిత్రం పూర్తిగా వైసీపీకి పట్టున్న ప్రాంతం. జగన్ ఓటు బ్యాంకుగా భావించే ముస్లీంలే 52 వేలు ఉన్నారు. టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి తో పోల్చుకుంటే వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఏ కోణంలో చూసుకున్నా వంద శాతం బలవంతుడు. ఇన్ని అనుకూలతల మధ్య కూడా వైసీపీ ప్రభావం చూపలేకపోయింది. గెలుపు సంగతి దేవుడెరుగు కనీసం టీడీపీ మెజారిటీని నిలువరించలేకపోయింది. ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా నియమించుకున్న తర్వాత తొలి ఎన్నికలోనే జగన్ బొక్కబోర్లా పడ్డారు. జగన్ సమర్ధత పై వైసీపీ శ్రేణుల్లో నమ్మకం సన్నగిల్లుతోన్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ ను తెర మీదకు తెచ్చారు. సాధారణంగా వ్యూహకర్తలు తెర వెనుక మంత్రాంగం నడుపుతారు. కానీ, శ్రేణుల్లో నమ్మకం కలిగించడం కోసం పీకేని జగన్ ఏకంగా ప్లీనరీ వేదిక ఎక్కించి, అందరికీ పరిచయం చేశారు. ఇన్ని చేసినా నంద్యాల ఫలితాలు వైసీపీని చావు దెబ్బతీశాయి. 2019 ఎన్నికలకు నంద్యాల సెమీ ఫైనల్ అని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. చంద్రబాబు మూడేళ్ల పాలనకు రెఫరెండంగా జరుగుతోన్న ఎన్నిక అని స్వయంగా జగనే ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు. ఇన్ని చేసినా వైసీపీ ఘోర ఫలితాలను చవిచూసింది. ఈ ఫలితాలతో జగన్ ను ప్రజలు అసలు ప్రధాన ప్రతిపక్ష నేతగా పరిగణించడం లేదన్న భావన కలుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనకు ఏపీలో మంచి భవిష్యత్ ఉంటుందన్న వాదన మొదలైంది. పవన్ ప్రస్తుతానికి టీడీపీకి సన్నిహితంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నప్పటికీ…ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వైసీపీ కంటే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఉద్దానం కానీ, రాజధాని భూముల వ్యవహారంలో కానీ వైసీపీ కంటే జనసేనే తన అస్థిత్వాన్ని చాటు కుంది. ఇంకా నిర్మాణం కూడా పూర్తి చేసుకోని జనసేన స్పందించిన మాత్రంగా కూడా వైసీపీ పోరాడలేకపోయింది. పైగా జగన్ హైదరాబాదు వదిలి అమరావతికి రావడం గగనంగా మారింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తానని పవన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ స్థానాన్ని జనసేన భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Your Comments / Feedback