English Version
  26 Sep, 2017
Home / Politics / అద్దెకు టీఆర్ఎస్ నేతలు!

అద్దెకు టీఆర్ఎస్ నేతలు!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: తెలంగాణలో రాజకీయ వ్యూహాలు పదునెక్కుతున్నాయి. పార్టీలు బలాలు పెంచుకోవడం కోసం ఎత్తులు పై ఎత్తులకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఈ విషయంలో వేగంగా పావులు కదుపుతోంది. ఆయా పార్టీల నుంచి నేతలను తెచ్చుకుని మందబలం పెంచుకోవాలనుకుంటోంది. బీజేపీ ఆలోచన సరే…ఇతర పార్టీల నేతలు ఇప్పుడు బీజేపీలో ఎందుకు చేరాలి? అక్కడ ఏముందని చేరాలి? వెళ్లిన వాళ్లు సొంతంగా పలుగు-పార తీసుకువెళ్లి పునాదులు వేసుకోవాల్సిన పరిస్థితి. మోదీ బొమ్మ చూపి తెలంగాణలో పెద్దగా తట్టకెత్తుకోవడానికి ఏమీ లేదు. అందుకే బీజేపీ ద్విముఖ వ్యూహంతో అడుగులు వేస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అట్టహాసంగా చేయడానికి సిద్ధమవుతోంది. దీనికి ఎన్నడూ లేని విధంగా కేంద్రహోం శాఖ మంత్రి రాజ్ నాథ్ ను తీసుకువస్తోంది. తద్వారా రిలీజియన్ పోలరైజేషన్ కు ప్లాన్ చేస్తోంది. ఈ అస్త్రం పాతదే! కాకపోతే ఈ సారి దానిని భిన్నంగా, బలంగా ప్రయోగించబోతోంది. తద్వారా హిందూ పోలరైజేషన్ కు అవకాశం ఉంటుందన్నది ఆ పార్టీ అంచనా. అప్పటికీ ఇతర పార్టీల నేతలు – ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కమలానికి ఆకర్షితులు కాకపోతే ఏం చేయాలన్న దానికి మరో వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. దీనికోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఓ అవగాహనకు వచ్చినట్టు బీజేపీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఆయన విశ్లేషణ ప్రకారం- బీజేపీకి దేశస్థాయిలో, టీఆర్ఎస్ కు రాష్ట్రస్థాయిలో ఉమ్మడి శత్రువు కాంగ్రెసే. మేము, కేసీఆర్ కలిసి ముందు కాంగ్రెస్ ను ఫినిష్ చేస్తాం. మా కలయిక అంతర్గతంగా మాత్రమే ఉంటుంది. బయటకు టీఆర్ఎస్ కు మేమే ప్రత్యామ్నాయం అన్నట్టుగా మా కార్యచరణ ఉంటుంది. అవసరమైతే టీఆర్ఎస్ నుంచి ఓ పదిమంది ప్రజాప్రతినిధులు మా పార్టీలో చేరతారు. తద్వారా బీజేపీ బలంగా ఉందన్న సంకేతాలు వెళతాయి. కాంగ్రెస్ నేతలు మా పార్టీలో చేరడానికి, వారిలో మా పార్టీ బలపడుతోందన్న నమ్మకం కలిగించడానికి ఈ చర్య ఉపయోగపడుతుంది. తద్వారా మేం బలపడతాం. కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమిస్తాం. 2019లో మళ్లీ కేసీఆరే వచ్చినా, 2024 కు మాకు పునాదులు పడతాయి. ఈ వ్యూహం మాకు, టీఆర్ఎస్ కు ఉభయతారకంగా ఉంటుంది. ఇద్దరం కలిసి ముందు ఉమ్మడి శత్రువును కొట్టేస్తాం…అని సదరు నేత విశ్లేషించారు. దీనికోసం అవసరమైతే టీఆర్ఎస్ నేతలనే అద్దెకు తెచ్చుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో కేసీఆర్ పట్ల జనంలో అనుకూలత ఉన్నా…ఆ పార్టీకి చెందిన చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉంది. అలాంటి వారిని మా పార్టీకి పంపడానికి కేసీఆర్ కు కూడా అభ్యంతరం ఉండదు. అలా వచ్చే నేతలను, కాంగ్రెస్ నేతలను ఆకర్షించడానికి మేం ఎరగా వాడుకుంటాం అని సదరు నేత ముక్తాయింపునిచ్చారు.

Your Comments / Feedback